భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్‌ భవితవ్యం | Indian American Judge Will Decide the Future of Pichais Google | Sakshi
Sakshi News home page

భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్‌ భవితవ్యం

Published Sun, Oct 1 2023 12:03 PM | Last Updated on Sun, Oct 1 2023 12:26 PM

Indian American Judge Will Decide the Future of Pichais Google - Sakshi

యూఎస్ కోర్టులో కొనసాగుతున్న యాంటీట్రస్ట్ కేసులో భారతీయ అమెరికన్ ఫెడరల్ జడ్జి అమిత్‌ మెహతా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక భారతీయుడు సీఈఓగా ఉన్న టాప్ టెక్ కంపెనీ భవితవ్యాన్ని తేల్చే బాధ్యత  మరో భారతీయ అమెరికన్ చేతిలో ఉంది.

ఇది 21వ శతాబ్దపు అతిపెద్ద టెక్ మోనోపోలీ కేసు. ఇది సెర్చ్‌ ఇంజిన్ దిగ్గజం, ఇంటర్నెట్ స్వభావాన్ని పూర్తిగా మార్చనున్నది. దీనిని 1998లో మైక్రోసాఫ్ట్‌పై జరిగిన యాంటీట్రస్ట్ ట్రయల్‌తో పోలుస్తున్నారు. దీనిలో టెక్ దిగ్గజానికి ఓటమి ఎదురయ్యింది.

న్యాయమూర్తి అమిత్ మెహతా సమక్షంలో ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ మూడు నెలల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు. కాగా మెహతా గుజరాత్‌లోని పటాన్‌లో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వచ్చారు. కాగా తమిళనాడులోని మదురైలో జన్మించిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన చదువు పూర్తి అయిన తర్వాత అమెరికాకు వచ్చారు. అటు అమిత్‌ మెహతా, ఇటు పిచాయ్‌ ఇద్దరూ దాదాపు ఒకే వయస్సులో ఉన్నారు. మెహతా వయస్సు 52 ఏళ్లు. పిచాయ్ కంటే ఒక ఏడాది ఎక్కువ. 

రెండు దశాబ్దాల క్రితం అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్‌లో శోధనను నిర్వహించడానికి ఒక వినూత్న మార్గంతో స్క్రాపీ స్టార్టప్‌గా గూగుల్ సిలికాన్ వ్యాలీకి డార్లింగ్‌గా మారిందని న్యాయ శాఖ తన 2020 నాటి ఫిర్యాదులో పేర్కొంది. ఇదే వ్యాజ్యానికి ఆధారం. ఇలా ఆవిర్భవించిన గూగుల్ అప్పుడే అంతరించిపోయింది. నేడున్న గూగూల్‌ ఇంటర్నెట్ గుత్తాధిపత్యానికి గేట్‌కీపర్‌గా మారింది. అత్యంత సంపన్న కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

గత కొన్నేళ్లుగా గూగుల్‌ సాధారణ శోధన సేవలు, శోధన ప్రకటనలు, సాధారణ శోధన టెక్స్ట్ ప్రకటనల కోసం మార్కెట్లలో తన గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సంస్థ విస్తరణకు పోటీ వ్యతిరేక వ్యూహాలను ఉపయోగించిందని న్యాయశాఖ ఆరోపించింది. మార్కెట్‌లో గూగుల్‌ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని నిర్వహించకుండా నిరోధించడానికి ఈ కేసు ఉద్దేశించినది. గుత్తాధిపత్య ఫిర్యాదులోని ప్రధాన అంశం ఏమిటంటే గూగుల్‌ దాని పరికరాలు, మొజిల్లా వంటి వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్‌ను డిఫాల్ట్ సెర్చ్‌ ఇంజిన్‌గా చేయడానికి ఆపిల్‌,శాంసంగ్‌ వంటి కంపెనీలకు కొన్ని బిలియన్లను చెల్లిస్తుంది. దీనివల్ల పోటీదారులు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండదు. అమెరికాలో గూగుల్‌ను సెర్చ్ ఇంజిన్‌గా 95 శాతం మేరకు ఉపయోగిస్తున్నారు.

కాగా గూగుల్‌ తమ అత్యుత్తమ నాణ్యత కారణంగా ప్రజలు తమ సెర్చ్‌ ఇంజిన్‌ను ఉపయోగించాలని కేసులో వాదించింది. అయితే ఈ విషయంలో తామేమీ బలవంతం చేయడంలేదని, ఇతర శోధన ఇంజిన్‌లకు సులభంగా మారవచ్చని కూడా తెలిపింది. ఈ కేసులో ప్రారంభ విచారణ బహిరంగం అయిన నేపధ్యంలో గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ తదిత టెక్ కంపెనీలు తమ వాణిజ్య రహస్యాలను బహిరంగంగా చర్చించడం వల్ల తమ కంపెనీలకు ప్రమాదం వాటిల్లుతుందని వాదించడంతో విచారణ రహస్యంగా కొనసాగుతోంది.

లారీ పేజ్,సెర్గీ బ్రిన్‌లు ‍స్థాపించిన సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ చివరికి యూఎస్‌లోని చట్టసభ సభ్యుల నుండి కూడా ఇలాంటి యాంటీట్రస్ట్ విమర్శలను ఎదుర్కొంది. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్‌కు చెందిన మార్క్ జుకర్‌బర్గ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌లు యుఎస్ కాంగ్రెస్ విచారణలో పిచాయ్‌ను ఇదే విషమయై ప్రశ్నించారు. రిపబ్లికన్ చట్టసభ సభ్యులు కూడా ఈ సీఈఓలందరూ గూగుల్‌ తీరును వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని ఫెడరల్ కోర్టులో ఈ కేసు విచారణ దశలో ఉంది. 
ఇది కూడా చదవండి: అనీ బిసెంట్‌ భారత్‌ ఎందుకు వచ్చారు? 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement