
చలచల్లగా మోసం
ధర్మవరం జాతీయ రహదారి సమీపాన రెండు దశాబ్దాల క్రితం కంచుస్తభం వెంకట సత్య ప్రసాద్ సాయిభ్య ఆగ్రి కోల్డు స్టోరేజీని నెలకొల్పారు. కాకినాడ దేనా బ్యాంకు నుంచి రూ. 28 కోట్లు బినామీ రుణాలు పొంది, ఎగవేయడంతో దేనా బ్యాంక్ అధికారులు కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తోపాటు మరో 111 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్టోరేజీలో రైతులు అందజేసే చింతపండు, ఎర్ర మిరప, మామిడి తాండ్ర, పత్తి విత్తనాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. కానీ అవేవీ నిల్వ చేయకుండానే ఉన్నట్టుగా లెక్కలు చూపించి భారీగా రుణాలు తీసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చింది.
రైతుల పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను బ్యాంకు అధికారలు పరిశీలించగా ఖాళీ పెట్టెల్లో వేరుశెనగ తొక్కలు, చెక్క పొట్టుతో ఉన్నాయి. రుణం పొందిన బినామీ రైతులంతా కోల్డు స్టోరేజీలో పనిచేస్తున్న కూలీలే. దీనిపై మహబూబ్ నగర్ జిల్లా కొత్త వనపర్తి మండలానికి చెందిన దేనా బ్యాంకు కాకినాడ బ్రాంచి మేనేజర్ గత ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టోరేజీ యజమాని సత్య ప్రసాద్ పరారీలోనే ఉన్నారు.