టీడీపీలో ‘బంగారం’ రగడ
సీఎం, ఎమ్మెల్యే గ్రూపుల మధ్య కోల్డ్‌వార్
కోట్ల విలువ చేసే నగల విషయంలో కేసులు
సీఎం దగ్గర కెళ్లి గోడు వెళ్లబోసుకున్న బాధితులు
ముగ్గుర్ని అరెస్టు చేసిన ఈస్ట్ పోలీసులు
తిరుపతి : నగర టీడీపీలో బంగారం రగడ పార్టీ పరువు బజారు కీడుస్తోంది. నాయకుల మధ్య పెరిగిన స్పర్థలు, గ్రూపు విభేదాలను తేటతెల్లం చేస్తోంది. అంతేకాకుండా సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే బంధువుల మధ్య గొడవలకు దారితీస్తోంది. ఇప్పటికే రెండు వేర్వేరు గ్రూపులుగా విడిపోయిన నగర పార్టీ నేతలు మధ్య తాజాగా తెరమీదకొచ్చిన బంగారం గొడవ మరింత దుమారాన్ని రేపుతోంది. పార్టీ వర్గాల్లో ఈ బంగారం రగడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సీఎం స్వగ్రామం నారావారిపల్లెకు చెందిన నాగరాజు అనే వ్యక్తి బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తుంటాడు. సుమారు ఏడెనిమిది నెలల కిందట వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసుకుని వాటిని వెంట తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్‌లో దిగాడు. రాత్రివేళ విలువైన నగలతో గ్రామానికి వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించి తిరుపతి నగరంలోని కొర్లకుంట ఏరియాలో ఉంటున్న పూర్వ పరిచయస్తుడు రఘుపతికి ఇచ్చి భద్రపర్చమన్నాడు. మరుసటి రోజు ఉదయం తీసుకెళతానన్న నాగరాజు రెండ్రోజుల తరువాత వెళ్లి నగలు ఇవ్వమంటే రఘుపతి అడ్డం తిరిగాడు. తనకు నగలు ఇవ్వలేదని సమాధానం ఇచ్చాడు. దీంతో నివ్వెరపోయిన నాగరాజు మోసపోయానని గుర్తించి వెంటనే తనకు పరిచయమున్న టీడీపీ నేతలను ఆశ్రయించి న్యాయం చేయమని అభ్యర్థించాడు. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉండే పార్టీ నాయకురాలు శ్రీదేవి బాధితుడు నాగరాజుకు ధైర్యం చెప్పి విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ లోగా రఘుపతి తన దగ్గర బంధువైన నగర పార్టీ నేత భాస్కర్‌యాదవ్ సాయంతో ఎమ్మెల్యేతో పాటు ఆమె పార్టీ వ్యవహారాలను చూసే బంధువు ఆశీస్సులు తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలో బాధితులు ఎన్నోసార్లు పోలీసులను ఆశ్రయించినా సరైన న్యాయం జరగలేదు. దీంతో చేసేది లేక బాధితులు మరికొంత మంది టీడీపీ నాయకులతో కలిసి ఈ మధ్యనే విజయవాడ వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి బంగారం గొడవను వివరించారు. సీఎం హెచ్చరించడంతో తిరుపతి అర్బన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు పూర్వాపరాలను రాబట్టారు. శనివారం సాయంత్రం రఘుపతితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు వెల్లడించిన వివరాలు కాస్తంత వేరుగా ఉన్నప్పటికీ తెరమీదకొచ్చిన బంగారం రగడ పార్టీ నాయకుల మధ్య చిచ్చు పెట్టిందన్నది వాస్తవమని అర్థమవుతోంది.