టీడీపీ పంచాయతీ
వైరివర్గాలతో బాబు 14న భేటీ
గవిరెడ్డి, ఆడారిలకు పిలుపు
గంటా, అయ్యన్నలకూ క్లాస్!
జిల్లా టీడీపీని అతలాకుతలం చేస్తున్న అయ్యన్న, గంటా వర్గం విభేదాల సెగ సీఎం చంద్రబాబును తాకింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఆయనే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నెల 14న జిల్లా పర్యటన సందర్భంగా మంత్రులు గంటా, అయ్యన్న వర్గాలన కూర్చొనబెట్టి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. విభేదాలకు తెరముందున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావులకు ఇప్పటికే కబురు అందింది.
విశాఖపట్నం: జిల్లా టీడీపీలో విభేదాలకు ఆద్యులైన తెరవెనుక పాత్రధారులు మంత్రులు గంటా, అయ్యన్నలను పిలిచి మాట్లాడాలని సీఎం చంద్రబాబు నిశ్చయానికి వచ్చారని సమాచారం. దీంతో అధినేత ముందే తాడోపేడో తేల్చుకోవడానికి ఇరు వర్గాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నెల 14న విశాఖపట్నంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ప్రత్యేకంగా కలవాలని గవిరెడ్డి రామానాయుడు, ఆడారి తులసీరావులకు పార్టీ కార్యాలయం నుంచి వర్తమానం అందింది. జిల్లాలో ఇటీవల పార్టీకి నష్టకలిగించేలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో ఆయనకే వివరణ ఇవ్వాలని కూడా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంత్రులు గంటా, అయ్యన్నలకు కూడా తెలిపారు. తద్వారా గవిరెడ్డి, ఆడారిలు చంద్రబాబును కలిసే సమయంలో వారిద్దరూ ఉండాలని చెప్పకనే చెప్పారు. ఇలా చంద్రబాబు అందర్నీ ప్రత్యేకంగా పిలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ పరువును బజారును పడేసిన గవిరెడ్డి, ఆడారిలను చంద్రబాబు తీవ్రస్థాయిలో మందలించనున్నారని స్పష్టమైంది. ఇప్పటికే ఎన్నికలు హామీలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల్లో పార్టీ, ప్రభుత్వ ప్రతష్ట దిగజారింది. మరోవైపు పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ పార్టీ పరువు బజారున పడేస్తుండటాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. అందులోనూ పార్టీ నేతలే సహచార నేతలు, ప్రభుత్వంపైన అవినీతి ఆరోపణలు చేయడాన్ని చంద్రబాబును తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ విషయాలపైనే చంద్రబాబు గవిరెడ్డి, ఆడారిలను మందలిస్తారని తెలుస్తోంది.
మంత్రులకూ క్లాస్!
మంత్రులు గంటా, అయ్యన్నలను కూడా చంద్రబాబు మండిపడుతున్నారు. అందుకే వారిద్దరికీ కూడా ఆయన గట్టిగా క్లాస్ పీకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగైదుసార్లు సుతిమెత్తగా చెప్పినప్పటికీ తీరు మార్చుకోకపోవడంపట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో తాను మరో ప్రత్యమ్నాయ నేతను చూసుకోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేస్తారని తెలుస్తోంది.
జిల్లా, జీవీఎంసీ పార్టీ అధ్యక్షుల మార్పు!?
వర్గ విభేదాల పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోవడంతో చంద్రబాబు పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్నారు. జిల్లా, జీవీఎంసీ పార్టీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమించాలని యోచిస్తున్నారు. గంటా, అయ్యన్నవర్గాలకు చెందకుండా తటస్థంగా ఉండే నేతలను సూచించాల్సిందిగా చంద్రబాబు మంత్రి నారాయణకు చెప్పారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
కత్తులు నూరుతున్న వైరివర్గాలు
చంద్రబాబు వద్ద పంచాయితీకి గంటా, అయ్యన్నవర్గాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకరు చేసిన తప్పులను మరొకరు ఎత్తిచూపడానికి జాబితా రూపొందిస్తున్నారు. గవిరెడ్డి, ఆడారిల విషయం వరకే చంద్రబాబు పరిమితమైతే ఒకలా... నేరుగా తమనే లక్ష్యంగా చేసుకుంటే మరోలా ఎదురుదాడి చేయాలని భావిస్తున్నారు. దాంతో ఈ నెల 14న సమావేశం ఎలా ఉండబోతోందనని టీడీపీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.