రిపోర్టు రాసేస్తా..!
రిపోర్టు రాసేస్తా..!
Published Fri, Jul 29 2016 12:38 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
పనుల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
ఈఓతో కలసి పుష్కర ఘాట్ల పరిశీలన
కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు
శ్రీశైలం : పుష్కర పనుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న వారందరిపై రిపోర్టు రాసేస్తానని హెచ్చరించారు. గురువారం శ్రీశైలం చేరుకున్న ఆయన ఈఓ భరత్ గుప్తాతో కలిసి పాతాళగంగ పుష్కరఘాట్లను పరిశీలించారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్న మెట్లను పరిశీంచి భక్తుల స్నానానికి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయలేదా అని అక్కడి ఇంజనీర్లను ప్రశ్నించారు. 10 అడుగుల దూరంలో ప్లాట్‌పాం ఉంటుందని చెప్పారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రిపోర్టు రాస్తానని హెచ్చరించారు. కొండచరియ రాళ్లు విరిగిపడడంపై దేవస్థానం ఈఈపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కొండ చరియలు పడకుండా ఏర్పాట్లు
కొండ చరియలు విరిగిపడకుండా హైటెన్షన్ వైర్‌తో గ్రాటింగ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తించే అధికారులందరికి వచ్చే నెల 1 నుంచి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వారంతా ఆగస్టు 2 నుంచి పుష్కర విధుల్లో పాల్గొంటారన్నారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు
మూడు ప్రదేశాలలో భక్తులకు అన్ని సౌకర్యాలతో కూడిన పుష్కర నగర్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కర నగర్ చేరుకున్న భక్తులు క్లోక్‌రూమ్‌లో సామాన్లు భద్రపర్చుకుని తాత్కాలికంగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరికీ భోజన వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కర నగర్‌ల వద్ద సాంస్కతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఐదు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు.
ఐదారు రోజుల్లో పనులు పూర్తి
లింగాలగట్టు, పాతాళగంగలో జరుగుతున్న పనులన్నీ ఐదారు రోజుల్లో పూర్తవుతాయని కలెక్టర్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే పాతాళగంగకు వచ్చే ఘాట్ రోడ్డు నిర్మాణానికి బీటీ రోడ్డు వేయాలని ప్రతిపాదనలు పంపించామని, రక్షణ గోడ కట్టాల్సిన అవసరం ఉండడంతో ముందుగా అది పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ బీటీ కాకపోతే వెట్‌మిక్స్ లేదా గ్రావెల్ రోడ్డు వేసి రోలింగ్ చేస్తామన్నారు.
28 ఎస్‌ఆర్‌ఐ 03 ః పాతాళగంగ వద్ద పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ విజయమోహన్, ఈఓ భరత్ గుప్తా
Advertisement
Advertisement