భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు : కలెక్టర్
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో జరుగుతున్న పనులను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ గురువారం పరిశీలించారు. కృష్ణవేణి ఘాట్‌లో టైల్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్నాన ఘాట్‌లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేస్తున్న గదులను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కృష్ణవేణి ఘాట్‌లో ఏర్పాటు చేసిన పుష్కర కెనాల్‌కు 7వ తేదీ నాటికి నీరు విడుదల చేసేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
హోటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి : సబ్‌కలెక్టర్
విజయవాడ : కృష్ణాపుష్కరాల సందర్భంగా ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా హోటళ్లలో గదులు కేటాయించాలని సబ్ కలెక్టర్ డాక్టర్ జి.సృజన సూచించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం నగరంలోని 105 హోటళ్ల ప్రతినిధులతో సబ్‌కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్ సృజన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు మూడున్నర కోట్ల మంది భక్తులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. సమాన్యులతోపాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు, దేశవిదేశాల ప్రముఖులు, పర్యాటకులకు హోటళ్లలో బసకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గదుల కేటాయింపులో అధికారులకు హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిర్ణయించిన మేరకే గదుల ధరలు వసూలు చేయాలని, ఆహార పదార్థాలను నాణ్యతతో అందించాలని కోరారు. 12 గంటల టారిఫ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ బాలాజీ, గేట్‌వే, మురళీఫార్చ్యూన్, డీవీమానర్, ఐలాపురం తదితర హోటళ్ల ప్రతినిధులు హాజరయ్యారు.