అనంతపురం అగ్రికల్చర్ : నాసిరకం విత్తన వేరుశనగను సరఫరా చేసిన ఏజెన్సీలపై కలెక్టర్ జి.వీరపాండియన్ కన్నెర చేసినట్లు సమాచారం. పెద్ద ఎత్తున నాసిరకం విత్తనం ఇస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దారికొచ్చే పరిస్థితి లేదని భావించిన కలెక్టర్ కొరడా ఝులిపించేందుకు సిద్ధమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.
అందులో భాగంగా ఓ మండలానికి నాసిరకం విత్తనం సరఫరా చేసినట్లు ఫిర్యాదు రావడంతో మార్క్‌ఫెడ్ ఏజెన్సీపై రూ.లక్ష జరిమానా విధించినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత ఏఓకు మెమో ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. మార్క్‌ఫెడ్‌కు జరిమానా విధించినట్లు తెలియడంతో ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్ అధికారులతో పాటు పలువురు ఏఓలు, ఏడీఏల్లో గుబులు రేపుతోందనే చర్చ జరుగుతోంది. మార్క్‌ఫెడ్‌కు జరిమానా, ఏఓకు మెమో జారీ చేసిన విషయంపై వ్యవసాయశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. విషయం బయటకు పొక్కకుండా రూ.లక్ష జరిమానా నుంచి తప్పించుకునేందుకు మార్క్‌ఫెడ్ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నాసిరకం విత్తనంపై కలెక్టర్ కన్నెర
Published Sat, Jun 3 2017 7:40 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM
Advertisement