పరిహారం ఇంకా ఎందుకివ్వలేదు ?
- రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
- మానవత్వంతో పనిచేయండని క్లాస్
పెనుకొండ రూరల్ : కియో కార్ల కంపెనీ కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారం చెల్లించకపోవడంపై కలెక్టర్ వీరపాండియన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని యర్రమంచి భూములలో జరుగుతున్న పనులను పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే యర్రమంచి పొలాలకు చెందిన సుబ్బరాయుడు, సునీత, అస్మిత్ ప్యారీ తదితరులు తమకు ఇంకా పరిహారం అందలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన కలెక్టర్ ఏం చేస్తున్నారు మీరంతా.. రైతులకు పరిహారం ఎందుకు అందలేదంటూ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటివి తన దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. గత 50–60 ఏళ్లుగా వంక పోరంబోకు భూములు సాగు చేస్తున్నామని, వాటికి పరిహారం ఇవ్వలేదని సునీతమ్మ అనే మహిళా రైతు కలెక్టర్‌కు చెప్పారు. అయితే వంక పోరంబోకు భూములకు పరిహారం ఇవ్వాలని చట్టంలో లేదన్నారు. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల పట్టా భూములు అసైన్ట్ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదైనట్లు కొందరు రైతులు వీరపాండియన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే..మీరు మారరు.. మానవత్వంతో పనిచేయండి అంటూ అధికారులపై మండిపడ్డారు.
పనులను త్వరగా పూర్తి చేయాలి
కియో కార్ల కంపెనీ పరిశ్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. రూ.250 కోట్లతో ఎల్‌అండ్‌టీ సంస్థకు భూమి చదును పనులను అప్పగించామని ఆయన చెప్పారు. సంబంధిత అధికారులు దగ్గరుండి పనులు చేయించాలన్నారు. అవసరమైతే జిల్లా అధికారులను పనులు జరుగుతున్న ప్రదేశానికి డంప్ చేయాలన్నారు. యేడాదిలోపు పనులను పూర్తి చేయాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం దుద్దేబండ క్రాస్‌లోని టూరిజం గెస్ట్‌హౌస్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని, అందరూ కచ్చితంగా పాల్గొనాలని ఆదేశించారు. అంతకముందు పరిశ్రమల ప్లానింగ్ పర్పస్ మ్యాప్ గురించి పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్‌బాబు కలెక్టర్‌కు వివరించారు.