చాపరాయిలో కలెక్టర్ పర్యటన
చాపరాయిలో కలెక్టర్ పర్యటన
Published Tue, Jun 27 2017 11:58 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
మారేడుమిల్లి : వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని చాపరాయి గ్రామంలో అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు పక్కాగా చర్యలు చేపట్టామని, వైద్య బృందాలు అక్కడే ఉండి వైద్య సేవలు అందిస్తున్నాయని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మంగళవారం కలెక్టర్ బొడ్డగండి, చాపరాయి పరిసరాల గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మరో ఏడుగురిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. జీసీసీ నుంచి ఉచితంగా అందిస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని పరిశీలించారు. వీధుల్లోని తాగునీటి బోరుబావుల పనితీరును స్వయంగా పరిశీలించారు. వైద్యసేవలపై ఆరా తీశారు. గత ఆదివారం 32 మంది గిరిజనులను మెరుగైన వైద్య సేవల కోసం రంపచోడవరం తరలించామని, అందులో నలుగురు చిన్నారులను కాకినాడ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో అనారోగ్యాలు సంభవిస్తున్నా ఆ సమాచారాన్ని అధికారులకు తెలపకుండా గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. అక్కడ పనిచేసే ఆశా వర్కర్‌ను, వార్డు మెంబర్ నీలంరెడ్డిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తామని అన్నారు. రక్షిత జలాలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పీవో దినేష్‌కుమార్, జోడేశ్వరరావు, ఏడీఎం ఆండాళ్, హెచ్‌వో పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement