పనితీరు మారకపోతే చర్యలు
-
కలెక్టర్ ముత్యాలరాజు
కోట: పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని సాంఘిక సంక్షేమ ఎస్సీ గురకుల పాఠశాల, కళాశాల సిబ్బందిపై కలెక్టర్ ముత్యాలరాజు మండిపడ్డారు. కలెక్టర్‌తోపాటు, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ బుధవారం రాత్రి స్థానిక గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలోని వసతులు, భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని మరుగుదొడ్లను, వంటగదులను, డార్మింగ్ రూమ్‌లను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం భోజనం రుచి చూశారు. పాఠశాలలోని విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంపై పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిని సరిదిద్దుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. పాఠశాలలో విద్యార్ధుల సంఖ్యతోపాటు జిల్లా అధికారుల చిరునామాలను గోడలకు అంటించాలన్నారు. విద్యార్థులు, సిబ్బందితో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని అందుకు మరో 20 మరుగుదొడ్లును మంజూరు చేస్తున్నామన్నారు. వారి వెంట సోషల్ వేల్ఫేర్ డీడీ మధుసూదన్‌రావు, గూడూరు ఇన్‌చార్జ్ ఆర్డీ వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఉన్నారు.