గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కమీషన్ల కోసం రాజధాని జపం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు.
పులపత్తూరు (రాజంపేట రూరల్): గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు కోకొల్లలుగా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం కమీషన్ల కోసం రాజధాని జపం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పులపత్తూరు, అచ్చనపల్లె, రేణింతల, మందపల్లె గ్రామాలలో ఆకేపాటి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు తాము పడుతున్న ఇబ్బందులను ఆకేపాటి ఎదుట ఏకరవు పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక వైపు రాష్ట్రంలో డెంగీతో ప్రజలు మత్యువాత పడుతున్నా బాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు.
మరో మూడు, నాలుగు నెలల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నందున టీడీపీ నాయకులు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై హడావుడి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నెల రోజుల క్రితం వరకు రాజంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం గురించి అధికారులు, అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చే సమయంలోనే వీరికి ప్రజలు గుర్తొస్తారా అని ఆయన ప్రశ్నించారు.. ఈ కార్యక్రమంలో పులపత్తూరు ఉప సర్పంచ్ బీము సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాపినేని వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.