- నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్
- వీసీ సాయన్న హామీతో విరమణ
కామన్ మెస్ ఎదుట విద్యార్థుల ఆందోళన
Published Fri, Sep 23 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద హాస్టళ్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలనే డిమాండ్లతో ధర్నాకు దిగారు. ఈనెల 20న భోజనంలో ఇనుప మొలలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం 11 గంటల నుంచి కామన్ మెస్‌కు తాళం వేసి.. కేయూ వీసీ సాయన్న తమ వద్దకు రావాలని పట్టుబట్టారు. ‘ఇదే మి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం, పెరుగన్నం మీకు పురుగుల అన్నం మాకా’ అంటూ నినాదాలు చేశారు. వీసీ తమవద్దకు వచ్చేవరకు భోజనం చేసేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేన్ సిబ్బంది వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు ఒప్పుకోలేదు. ఆందోళన విషయాన్ని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ ప్రసాద్, వీసీ సాయన్న దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచన మేరకు మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు, అకడిమక్ ఆడిట్ డీన్ టి.రమేష్, ప్రొఫెసర్ బి. దిగంబర్‌రావు, ప్రొఫెసర్ దయాకర్‌రావు, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ . ప్రసాద్ కామన్ మెస్‌వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చే వరకు ఆందోళన విరమించమని ప్రొఫెసర్లతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే కామన్ మెస్ గేట్ తాళం తీసినా విద్యార్థులు లోపలకు వెళ్లలేదు. పోలీసులు గోబ్యాక్, విద్యార్థి సంఘాల నాయకులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీసీ సాయన్న కామన్ మెస్ వద్దకు వచ్చారు. విద్యార్థులు వీసీతోనూ వాగ్వాదానికి దిగారు. కామన్ మెస్‌లో సకాలంలో భోజనం అందడం లేదని, నాణ్యమైన భోజనం కావాలని, హాస్టళ్లలో వసతులు కల్పించాలని, ప్రతాపరుద్ర మెస్‌ను కూడా తెరిపించాలని డిమాండ్ చేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని వీసీ హామీ ఇచ్చారు. వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి 5–30 గంటల ప్రాంతంలో భోజనం చేశారు. కామన్ మెస్‌లో సుమారు 960 మంది విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు ప్రతాపరుద్ర మెస్‌లో, సెకండియర్ విద్యార్థులకు కామన్ మెస్‌లో భోజన సౌకర్యం కల్పించారు. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు కామన్ మెస్‌లోకి వెళితే ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఫస్టియర్, సెకండియర్ వారికి వేర్వేరుగా మెస్ సౌర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, ఆందోళన నేపథ్యంలో భోజనం చేయకపోవటంతో గురువారం మధ్యాహ్నం ఓ విద్యార్థి నీరసించిపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారని సమాచారం. బియ్యంలో మొలలు వచ్చాయని విద్యార్థులు ఈనెల 20న ఆందోళన చేసిన నేపథ్యంలో బియ్యాన్ని మార్చామని హాస్టళ్ల డైరెక్టర్ తెలిపారు.
Advertisement