Common mess
-
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్‌రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్‌రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్‌రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్‌రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్‌లోకి రాకుండా నిరంజన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్‌రెడ్డిని తొలగించాలని డైరెక్టర్‌తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్‌కు వచ్చి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్‌రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
కామన్ మెస్ తెరుచుకునేదెప్పుడో
కేయూ క్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో వేసవి సెలవుల అనంతరం పీజీ కోర్సులు మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభమై 20 రోజులైనా నేటికి కామన్ మెస్ తెరుచుకోలేదు. జూన్ 26 నుంచి తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు ఇప్పటికీ మెస్కార్డులు రెన్యూవల్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గత విద్యా సంవత్సరం మెస్ బకాయిలు చెల్లించిన తర్వాతే మెస్ కార్డులు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విద్యార్థికి స్కాలర్షిప్లు పోను రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు బకాయిలు చెల్లించాల్సింటుంది. 60 బకాయిలు చెల్లించినా మెస్ కార్డు రెన్యూవల్ చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 40 మంది విద్యార్థులు మాత్రమే రెన్యూవల్ చేసుకున్నారు. కనీసం వంద మంది విద్యార్థులైనా కార్డులు రెన్యూవల్ చేసుకుంటే తప్ప మెస్ ఓపెన్ చేయరు. గత నెల 26 నుంచే ఇంజినీరింగ్ విద్యార్థులకు మెస్ ప్రారంభమైంది. లేడీస్ హాస్టల్ సైతం ఓపెన్ చేశారు. కామన్ మెస్‌లో వేయి మందికిపైగా మెస్కార్డులు తీసుకునే వీలున్నా 40 మంది వరకే రెన్యూవల్ చేసుకున్నారు. మూడో సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు హాజరు కావడం లేదు. విద్యార్థులకు 75 శాతం మేర హాజరు శాతం తప్పని సరి అనే నిబంధన ఉన్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో విద్యార్థులు తరగతులు కూడా హాజరు కావడంలేదు. తెరుచుకోని పోతన హాస్టల్ విద్యార్థులు మెస్కార్డులు రెన్యూవల్ చేసుకుంటే వారికి మొదటగా పోతన హాస్టల్‌ను కేటాయిస్తారు. విద్యార్థులు రాకపోవటంతో పోతన హాస్టల్‌ను సైతం ఇప్పటవరకు ఓపెన్ చేయలేదు. ఈ సారి హాస్టళ్లో నాన్‌బోర్డర్లు లేకుండా చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మెస్కార్డులు రెన్యూవల్ చేసుకున్న వారికే రూమ్‌లు కేటాయించే యోచనలో ఉన్నారు. పోతన హాస్టల్ పూర్తయిన తర్వాతే జగ్జీవన్, అంబేద్కర్, ఓల్డ్ ఫార్మసీ, జీడి 2, జీడీ 3లలో హాస్టల్ వసతి కల్పిస్తారు. పీజీ కోర్సుల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అడ్మిషన్లు పూర్తి కాగానే హాస్టల్ వసతి మెస్ సౌకర్యం కల్పించాలనే యోచనలో హాస్టల్ అధికారులు ఉన్నారు. త్వరగా మెస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు -
కామన్ మెస్ ఎదుట విద్యార్థుల ఆందోళన
నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ వీసీ సాయన్న హామీతో విరమణ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద హాస్టళ్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలనే డిమాండ్లతో ధర్నాకు దిగారు. ఈనెల 20న భోజనంలో ఇనుప మొలలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి కామన్ మెస్‌కు తాళం వేసి.. కేయూ వీసీ సాయన్న తమ వద్దకు రావాలని పట్టుబట్టారు. ‘ఇదే మి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం, పెరుగన్నం మీకు పురుగుల అన్నం మాకా’ అంటూ నినాదాలు చేశారు. వీసీ తమవద్దకు వచ్చేవరకు భోజనం చేసేది లేదని భీష్మించారు. సమాచారం అందుకున్న కేయూ పోలీస్టేన్ సిబ్బంది వచ్చి సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు ఒప్పుకోలేదు. ఆందోళన విషయాన్ని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ ప్రసాద్, వీసీ సాయన్న దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సూచన మేరకు మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు, అకడిమక్ ఆడిట్ డీన్ టి.రమేష్, ప్రొఫెసర్ బి. దిగంబర్‌రావు, ప్రొఫెసర్ దయాకర్‌రావు, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎన్ . ప్రసాద్ కామన్ మెస్వద్దకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చే వరకు ఆందోళన విరమించమని ప్రొఫెసర్లతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే కామన్ మెస్ గేట్ తాళం తీసినా విద్యార్థులు లోపలకు వెళ్లలేదు. పోలీసులు గోబ్యాక్, విద్యార్థి సంఘాల నాయకులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీసీ సాయన్న కామన్ మెస్ వద్దకు వచ్చారు. విద్యార్థులు వీసీతోనూ వాగ్వాదానికి దిగారు. కామన్ మెస్‌లో సకాలంలో భోజనం అందడం లేదని, నాణ్యమైన భోజనం కావాలని, హాస్టళ్లలో వసతులు కల్పించాలని, ప్రతాపరుద్ర మెస్‌ను కూడా తెరిపించాలని డిమాండ్ చేశారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని వీసీ హామీ ఇచ్చారు. వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి 5–30 గంటల ప్రాంతంలో భోజనం చేశారు. కామన్ మెస్‌లో సుమారు 960 మంది విద్యార్థులకు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు ప్రతాపరుద్ర మెస్‌లో, సెకండియర్ విద్యార్థులకు కామన్ మెస్‌లో భోజన సౌకర్యం కల్పించారు. ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు కామన్ మెస్‌లోకి వెళితే ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఫస్టియర్, సెకండియర్ వారికి వేర్వేరుగా మెస్ సౌర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా, ఆందోళన నేపథ్యంలో భోజనం చేయకపోవటంతో గురువారం మధ్యాహ్నం ఓ విద్యార్థి నీరసించిపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారని సమాచారం. బియ్యంలో మొలలు వచ్చాయని విద్యార్థులు ఈనెల 20న ఆందోళన చేసిన నేపథ్యంలో బియ్యాన్ని మార్చామని హాస్టళ్ల డైరెక్టర్ తెలిపారు. -
కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్‌టేకర్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్‌కు అనుకూలం గా కేర్‌టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్‌టేకర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
కేయూ విద్యార్థుల ఆమరణ దీక్ష
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో నాణ్యమైన భోజనం అందడం లేదని, యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ మెస్‌ను నడిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం రాత్రి భోజనంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ బీరకాయ కర్రి ఇచ్చారు. అది చేదుగా ఉందని కొందరు విద్యార్థులు అప్పుడే నిరసన తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యార్థులు కామన్మెస్కు తాళం వేశారు. తరగతుల బహిష్కరించి ఆమరణ దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి అక్కడికి వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరామని... ఈ మేరకు హామీ ఇచ్చి మరచిపోయూరంటూ ఆయనతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. బీరకాయ కూర చేదుగా ఉండడంతో వాంతులయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నాణ్యమైన భోజనమందించేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు. వారు ససేమిరా అనడంతో ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు, ప్రిన్సిపాల్ రామస్వామి ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాంసన్ ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేసి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోరుతున్నా.. పట్టించుకోకోపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని విద్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను ఎత్తివేయడం తమ చేతుల్లో లేదని, రెగ్యులర్ వీసీ వచ్చేవరకు ఆగాలని రంగారావు వారికి సూచించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేయకపోతే యూనివర్సిటీని బంద్‌చేసి ఆందోళనలు చేస్తామని విద్యార్థులు స్పష్టం చేయడంతో వారు వెళ్లిపోయూరు. కాగా, కామన్మెస్ కు తాళం వేసి విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగడంతో గురువారం ఉదయం అల్పాహారంతో సహా రెండు పూటల భోజనం బంద్ కావ డంతో పీజీ ఫైనలియర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, రాత్రి ఇన్చార్జ రిజిస్ట్రార్, క్యాంపస్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో చర్చించారు. మూడు ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు.