కేయూ విద్యార్థుల ఆమరణ దీక్ష
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్‌మెస్‌లో నాణ్యమైన భోజనం అందడం లేదని, యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ మెస్‌ను నడిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం రాత్రి భోజనంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ బీరకాయ కర్రి ఇచ్చారు. అది చేదుగా ఉందని కొందరు విద్యార్థులు అప్పుడే నిరసన తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యార్థులు కామన్‌మెస్‌కు తాళం వేశారు. తరగతుల బహిష్కరించి ఆమరణ దీక్షకు దిగారు.
సమాచారం అందుకున్న క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి అక్కడికి వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరామని... ఈ మేరకు హామీ ఇచ్చి మరచిపోయూరంటూ ఆయనతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. బీరకాయ కూర చేదుగా ఉండడంతో వాంతులయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నాణ్యమైన భోజనమందించేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు. వారు ససేమిరా అనడంతో ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం కేయూ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు, ప్రిన్సిపాల్ రామస్వామి ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాంసన్ ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించారు.
ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేసి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోరుతున్నా.. పట్టించుకోకోపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని విద్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను ఎత్తివేయడం తమ చేతుల్లో లేదని, రెగ్యులర్ వీసీ వచ్చేవరకు ఆగాలని రంగారావు వారికి సూచించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేయకపోతే యూనివర్సిటీని బంద్‌చేసి ఆందోళనలు చేస్తామని విద్యార్థులు స్పష్టం చేయడంతో వారు వెళ్లిపోయూరు. కాగా, కామన్‌మెస్ కు తాళం వేసి విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగడంతో గురువారం ఉదయం అల్పాహారంతో సహా రెండు పూటల భోజనం బంద్ కావ డంతో పీజీ ఫైనలియర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, రాత్రి ఇన్‌చార్‌జ రిజిస్ట్రార్, క్యాంపస్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో చర్చించారు. మూడు ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు.