
శోధన.. రంధ్రాన్వేషణ
♦ ఇంటింటా సమగ్ర సమాచార సేకరణ
♦ జిల్లాలో స్మార్ట్‌పల్స్ సర్వే ప్రారంభం
♦ 80 ప్రశ్నలతో వ్యక్తిగత వివరాల సేకరణ..
♦ తొలిరోజు మందకొడిగా సాగిన ప్రక్రియ
♦ ప్రోటోకాల్ పేరుతో గంటల కొద్దీ జాప్యం
♦ ట్రయల్న్‌గ్రా పేర్కొన్న అధికారులు
ఒంగోలు/ పుల్లలచెరువు : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం స్మార్టు పల్స్ సర్వే (ప్రజాసాధికారిక సమాచార సేకరణ) ప్రారంభమైంది. ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించేందుకు సిబ్బంది సమాయత్తమయ్యూరు. తొలిరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసం నుంచి సర్వే ప్రారంభమైంది. అక్కడ సర్వే సజావుగా సాగినప్పటికీ అనంతరం సమస్యలు ప్రారంభం అయ్యాయి. సర్వర్లు మొరారుుంచడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది.
సర్వే సిబ్బంది ఒక్కొక్కరు రోజుకు 14 కుటుంబాలను అప్‌డేట్ చేయాల్సి ఉంది. అంటే ఒక్కో కుటుంబానికి కనీసంగా అరగంట సమయం పడుతుంది. దీని ప్రకారం సిబ్బందికి 7గంటలు సమయం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది అంతా ట్యాబ్‌లలో పని ప్రారంభించడంతోనే సర్వర్‌లు మొరాయించాయి. దీంతో సిబ్బంది గంటలకొద్దీ ఎదురుచూసినా ఉపయోగం లేకుండా పోయింది. మొరాయించిన సర్వర్‌లు, మరో వైపు ట్యాబ్‌లకు చార్జింగ్ సమస్యలు, చీరాల, కందుకూరు ప్రాంతంలో నెట్ వర్క్ సమస్యలు వెరసి 15 శాతం కూడా చేయలేకపోయారు. వీఐపీలకు సంబంధించి స్మార్ట్ పల్స్ సర్వేచేశామని, ఇది ట్రయల్ రన్ అంటూ అధికారులు చెప్పుకొచ్చారు.
వివరాలు ఆన్ లైన్‌లో నిక్లిప్తం..
మొత్తం 30 రోజుల పాటు జరగనున్న ఈ సర్వేలో 80 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఎన్యూమరేటర్లు, సహాయకులను ఇప్పటికే నియమించారు. స్మార్టు పల్స్ సర్వేలో కీలకపాత్ర పోషించే ఎన్యూమరేర్లుకు సమగ్ర సమాచార సేకరణ చేసేందుకు ప్రత్యేకంగా ట్యాబ్‌ల పంపిణీ చేశారు. ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు కనీసం 14 కుటుంబాలకు చెందిన వివరాలను ట్యాబ్‌ల సహాయంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వివరాలను ఎప్పటికప్పడు ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా ఓ వెబ్‌సైట్ తయారు చేశారు. దీనిని జీపీఎస్ సిస్టం ద్వారా అనుసంధానం చేస్తారు. ప్రతి ఇంట్లో ఉండే వస్తువులతో పాటు వాహనాలు, విద్యుత్తుబిల్లులు చెల్లింపు, స్థిర చరాస్తుల వివరాలను ఆధికారులు సేకరించబోతున్నారు. కుటుంబ వివరాలు ఎలా నింపాలో నమూన గణాంక సర్వే ఇప్పటికే పూర్తి చేయగా అయా కుటుంబాల సాంఘిక, ఆర్థిక, వ్యక్తిగత సమాచారాన్ని 80 ప్రశ్నలతో నమోదు చేస్తారు.
చూపించాల్సిన కార్డులు, ధ్రువపత్రాలు..
స్మార్టు పల్స్ సర్వే కోసం వచ్చే సిబ్బందికి కుటుంబసభ్యులకు సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరుగుర్తింపు కార్డు, ఆదాయపు పన్ను ఐడీ, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లెసైన్స్, వాహన రిజస్టేషన్, పట్టాదారు పాస్ పుస్తకం లేదా భూమి ఖాతా నంబర్, ఎల్‌పీజీ వినియోగదారుని పుస్తకం, బ్యాంక్ పాస్‌బుక్, వికలాంగ సదరం ధ్రువీకరణ పత్రం, నీటిపన్ను రసీదు, కుల ధ్రువీకరణ పత్రం(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు), ఆదాయపత్రం, కిసాన్‌కార్డు, పింఛను ధ్రువీకరణ పత్రం, ఉపాధికార్డు, జనన ధ్రువీకరణ పత్రం, ఉపకార వేతన గుర్తింపు పత్రం చూపించాలని శుక్రవారం పుల్లలచెరువు మండలంలో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రత్యేకాధికారి కొండయ్య తెలిపారు.
పథకాల వివరాలు తెసుకునేందుకే: కలెక్టర్
ఎమ్మెల్యే ఇంటి వద్ద స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మీడియాతో మాట్లాడారు. ప్రజాసాధికార సర్వేకు 2312 ఎన్యూమరేషన్ బ్లాకులను, మండల స్థాయి సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సర్వే మానిటర్ చేసేందుకు జిల్లా స్థాయి కమిటీ నియోజకవర్గ సమన్వయ అధికారులను, జిల్లాస్థాయి సాంకేతిక బృందాలను, మండల స్థాయి, మున్సిపల్ పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
సర్వేద్వారా వ్యక్తిగతంగా సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులు తెలుసుకుంటామన్నారు. ప్రభుత్వం పథకాల ద్వారా లబ్దిదారులు ప్రయోజనం, ఇంకా వారికి అందాల్సిన సంక్షేమ ఫలాలు వివరాలు తెలుసుకోనున్నట్టు చె ప్పారు. ఈ సర్వే ఈ నెలాఖరు వరకు, తిరిగి ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఆధార్ వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, కనుక సర్వే బృందాలు అడిగిన సమాచారం అందజేయాలన్నారు. ఈ సందర్భంగా సర్వే బృందం ఇట్టా చినరామయ్య కుటుంబ సభ్యులను టాబ్, ఐరిష్ ద్వారా వివరాలు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేశారు.
సర్వే బృందంలో సూపర్‌వైజర్ అమ్మిరెడ్డి, మాస్టర్ ట్రైనీలు విశ్వనాథ్, బాలరాజు, ఎన్యూమరేటర్ సాయిరాఘవ పాల్గొన్నారు. జేసీ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఒంగోలు ఆర్‌డీవో కమ్మ శ్రీనివాసరావు, ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.వి.సుధాకర్, మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.