రాజీ మార్గమే రాజ మార్గం
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి
డోన్ టౌన్: రాజీ మార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి అన్నారు. డోన్ మున్సిఫ్ కోర్టులో పోలీస్, రెవెన్యూ అధికారులతో ఆమె మంగళవారం సమావేశమయ్యారు. వచ్చే నెల 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్మయంతో కృషిచేయాలన్నారు. కక్షిదారులను రాజీకి ఒప్పించి వాటి వల్ల వనకూరే ప్రయోజనాల గురించి వివరించాలన్నారు. మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్‌లు కరిముల్లా, సూరికృష్ణ, డోన్ డీఎస్పీ బాబాఫకృద్దీన్, సీఐ శ్రీనివాసులు గౌడ్, తహసీల్దార్ మునికృష్ణయ్య, ఎస్‌ఐలు శ్రీనివాసులు, జయశేఖర్, రామసుబ్బయ్య పాల్గొన్నారు.