కత్తులు వదిలేసి.. చేతులు కలిపి
కత్తులు వదిలేసి.. చేతులు కలిపి
Published Sun, Oct 9 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
– లోక్‌అదాలత్‌లో దుర్వేశి, చిందుకూరు ఫ్యాక‌్షన్ నేతలు రాజీ
– ప్రమాణం చేయించిన డీఎస్పీ
– పోలీస్, న్యాయమూర్తుల చొరవ
నంద్యాల: దశాబ్దాలుగా పగ, ప్రతీకారాలతో జీవితాలను నాశనం చేసుకున్నారు. ముఠాల పోరులో కొందరు బలి కాగా.. మరికొందరు జైలు పాలయ్యారు. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు. ఫ్యాక‌్షన్‌తో జీవితాలు నాశనమవుతాయే కాని సాధించిందేమీ లేదని తెలుసుకున్న ముఠా నేతలు రాజీ పడ్డారు. కత్తులను పక్కకు విసిరేసి, చేతులు కలిపారు. ఇకపై చంపుకోవడం, నరుక్కోవడం వద్దని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. స్థానిక కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లా జడ్జి మోహన్‌రావు, డీఎస్పీ హరినాథరెడ్డి, న్యాయమూర్తులు పోలీసు అధికారి సమక్షంలో గడివేముల మండలంలోని ఫ్యాక‌్షన్ గ్రామాలైన చిందుకూరు, దుర్వేశి గ్రామాల్లోని ఇరువర్గీయులు రాజీపడ్డారు. ఇకపై ఎలాంటి పగ, ప్రతీకారాలకు వెళ్లకుండా ప్రశాంత జీవితాన్ని గడుపుతామని ప్రతిజ్ఞ చేశారు.
గడివేముల మండలం చిందుకూరులో గతంలో సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. గడివేములలో ఒక రెవెన్యూ అధికారి ఇంట్లో ఉన్న వెంకటేశ్వరరెడ్డిపై వెంకటకృష్ణారెడ్డి వర్గం దాడి చేసి హత్య చేసినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ హత్య జరిగిన వెంటనే గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురు హత్యకు గురయ్యారు. వెంకటేశ్వరరెడ్డి హత్యా అనంతరం ఆయన భార్య అనసూయమ్మ రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా గెలిచారు. తర్వాత ఈమె వర్గీయులు దారి కాచి వెంకటకృష్ణారెడ్డి వర్గానికి చెందిన నలుగురిని హత్య చేశారు. వెంకటేశ్వరరెడ్డి హత్య కేసును కోర్టు కొట్టి వేసింది. కాని తనదనంతరం జరిగిన హత్య కేసుల్లో కొంత మంది నిందితులు జీవిత ఖైదు శి„క్షను కూడా అనుభవించి, బయటకు వచ్చారు. దుర్వేశి గ్రామంలో గతంలో సర్పంచ్ శివారెడ్డిని నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ జంక్షన్ సమీపంలో ప్రత్యర్థులైన దుర్వేశి గొల్ల కృష్ణుడు వర్గీయులు హత్య చేశారు. దీని ప్రతీకారంగా శివారెడ్డి వర్గీయులు జరిపిన ప్రతీకార దాడుల్లో 8 మంది హత్యకు గురయ్యారు. ఈ కేసుల్లో కూడా కొంత మంది శిక్షను అనుభవించారు.
పోలీసు, న్యాయమూర్తుల సమక్షంలో రాజీ:
ఫ్యాక‌్షన్‌తో అయిన వారికి దూరమై, జైలు పాలై కొంత మంది నరకాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరికొందరు ఆర్థికంగా చితికి పోయి, పేదరికం కష్టాలను అనుభవిస్తున్నారు. దీంతో దుర్వేశి గ్రామానికి చెందిన ప్రత్యర్థులు గొల్ల కృష్ణుడు, దామోదర్‌రెడ్డి వర్గీయులు కొందరు చిందుకూరు గ్రామంలోని అనసూయమ్మ, వెంకటకృష్ణారెడ్డి వర్గీయులు వీరు రాజీ పడాలని లోక్ అదాలత్‌కు హాజరయ్యారు. జిల్లా జడ్జి మోహన్‌రావు, సబ్ జడ్జి నాగేశ్వరరావు, జ్యూడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శైలజ, డీఎస్పీ హరినాథరెడ్డి సమక్షంలో వీరు తాము రాజీ పడుతున్నామని చెప్పారు. ఇకపై ఎలాంటి గొడవలకు, ప్రతీకారాలకు వెళ్లమని, ప్రశాంత జీవితాన్ని గడుపుతామని చెప్పారు. డీఎస్పీ హరినాథరెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ఫ్యాక‌్షన్ గ్రామాల నేతలు రాజీ కావాలని, ప్రశాంత జీవితాన్ని గడపుతూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement