రైతుల మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర | Conduct IAB meet | Sakshi
Sakshi News home page

రైతుల మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర

Published Thu, Oct 27 2016 11:50 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

రైతుల మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర - Sakshi

రైతుల మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర

  • ఐఏబీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి
  • జిల్లా మొత్తానికి సాగునీరందించాలి
  • రైతులను డెల్టా, నాన్‌ డెల్టాగా విడగొట్ట రాదు
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల డిమాండ్‌ 
  •  
    సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
    తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులందరినీ ఒకే విధంగా చూడకుండా, డెల్టా, నాన్‌ డెల్టాగా విడగొట్టి  వారి మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. జిల్లా నీటి యాజమాన్య సలహా మండలి సమావేశం (ఐఏబీ) వెంటనే ఏర్పాటు చేసి జిల్లా మొత్తానికి నారుమళ్లు వేసుకోవడానికి నీరు విడుదల చేసేలా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
     సోమశిల జలాశయంలోని నీటిని నమ్ముకుని నారుమళ్లు పోసుకోవాలనుకుంటున్న రైతాంగానికి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం డెల్టాకు మాత్రమే నీరిచ్చి మెట్ట ప్రాంతాల రైతులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని జెడ్పీ చైర్మన్‌ రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. సోమశిల రిజర్వాయర్‌లో ఉన్న 37 టీఎంసీల నీటితో పాటు చెన్నయ్‌ తాగునీటి కోసం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సిన 10 టీఎంసీల నీటిని ప్రభుత్వం తెప్పిస్తే జిల్లా మొత్తానికి సాగునీరు అందించవచ్చన్నారు. అలాగే కండలేరు రిజర్వాయర్‌లో ఉన్న 20 టీఎంసీల నీటితో ఆ ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. డెల్టాకు మాత్రమే నీరివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయొద్దనీ, జిల్లా మొత్తాన్ని ఒకే విధంగా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు.
    టీడీపీ సొంత వ్యవహారమా? 
    టీడీపీ నాయకులు వారి పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవడానికి ఇది వారి సొంత వ్యవహారమా? అని  ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. జిల్లా మొత్తానికి మొదటి పంటకు నీరిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సాగునీటి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మంత్రి నారాయణ జిల్లా గురించి పట్టించుకోవడం మానేశారనీ, ఆయనకు ఎప్పుడూ అమరావతిలో సింగపూర్‌ కంపెనీలకు భూములు ఇప్పించడం తప్ప మరే ధ్యాస లేదన్నారు. సంగం బ్యారేజీ నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచిందన్నారు. కావలిలో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులో నీళ్లు అయిపోయాయని తాము చెబుతుంటే పట్టించుకోక పోవడం వల్ల తాగునీటి కరువు ఏర్పడిందన్నారు.  ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి కొందరు టీడీపీ నాయకులు లబ్ధి పొందేందుకు ఇలాంటి నీచానికి దిగజారారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఐఏబీ మీటింగ్‌పెట్టి జిల్లా మొత్తానికి మొదటి పంటకు నీరిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
    అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలి
     ప్రభుత్వం ఒక ప్రాంతాన్నే పట్టించుకుని మరో ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసి జిల్లా మొత్తానికి నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డెల్టా కింద రెండో పంటకు నీరిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని అధికారులు ముందే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పుడిచ్చిన 20 టీఎంసీల నీరు, ఇప్పుడున్న 37 టీఎంసీల నీరు కలిపితే జిల్లా మొత్తానికి అందించే అవకాశం ఉండేదన్నారు. ప్రభుత్వం రైతులను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందే చర్యలు మానుకోవాలనీ, జిల్లా మొత్తానికి నీరివ్వాలని డిమాండ్‌ చేశారు. పెన్నా అప్పర్‌ డెల్టా రైతులు తమ పరిస్థితి ఏమిటో అని ఆందోళనలో ఉన్నారనీ, ఆత్మకూరు నియోజకవర్గంలో పశువులకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐఏబీ మీటింగ్‌ పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.
     బ్రిటిష్‌ పాలనకంటే ఘోరంగా ఉంది
     వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అధికారులు పద్ధతిగా నీటి నిర్వహణ చేసి సోమశిలలో 20 టీఎంసీల నీరున్నా జిల్లా మొత్తానికి నారుమళ్లకు నీళ్లిచ్చే వారని మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు బ్రిటిష్‌ పాలనకంటే ఘోరంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో తమ పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేదని సీఎం కక్ష కట్టారని ఆరోపించారు. నీటి నిర్వహణ పెత్తనం కలెక్టర్‌ అధికారుల చేతిలో పెట్టి వారిని జిల్లా మొత్తానికి నీరు ఇప్పించే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement