ఆశలు ఆవిరి!
ఇక జిల్లా కమిటీలు లేనట్లే
టీఆర్‌ఎస్‌లో గందరగోళం
ముఖ్య నేతల నారాజ్
వరంగల్ : అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో పదవుల కోసం ఎదురుచూపులకు ఇప్పట్లో తెరపడే పరిస్థితి కనిపించడం లేదు. నామినేటెడ్, ఇతర అధికార పదవుల విషయం పక్కనబెడితే... పార్టీ పదవుల విషయంలోనూ నేతలకు నిరాశే మిగులుతోంది. జిల్లాల పునర్విభజనతో అధికారిక, పార్టీ పరంగా ఎన్నో పదవులు పెరుగుతాయని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పలుసార్లు చెప్పారు. జిల్లాల పునర్విభజన జరిగి వరంగల్ జిల్లా... వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలుగా మారింది. దీంతో కొత్త జిల్లాల్లో టీఆర్‌ఎస్ కమిటీలు ఏర్పాటవుతాయని, పదవులు వస్తాయని ఆ పార్టీ నేతలు ఆశించారు.
అయితే, జిల్లా కమిటీల ఏర్పాటుపై టీఆర్‌ఎస్ అధినేత ఇటీవల చేసిన ప్రకటనలతో పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే మొదలైంది. ఏప్రిల్ 6లోపు సభ్యత్వ నమోదు, గ్రామ పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఏప్రిల్ 12, 13వ తేదీల్లో పార్టీ మండల కమిటీలను నియమించాలని సూచించారు. అనంతరం వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. కానీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్‌లో టీఆర్‌ఎస్ అధిష్టానం... జిల్లా కమిటీలపై ఎక్కడా ప్రస్తావించ లేదు. దీంతో జిల్లా కమిటీల ఏర్పాటు ఉండదనే విషయంలో స్పష్టత వచ్చింది. జిల్లా కమిటీలే లేని పరిస్థితి ఉండడంతో పదవులు సంగతి మరిచిపోవాల్సిందేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఫలితంగా పదవులు ఆశించిన నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
అప్పుడు అలా...
రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన ప్రక్రియను నిర్వహించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే టీఆర్‌ఎస్ కొత్త జిల్లా కమిటీల ఏర్పాటుపై పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అప్పట్లోనే ప్రకటిస్తారని భావించినా జరగలేదు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి జిల్లా పార్టీ కమిటీల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అప్పుడూ కొత్త జిల్లాల కమిటీ నియామకం జరగలేదు.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో... వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గుడిమల్ల రవికుమార్, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఎడవెల్లి కృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది. భూపాలపల్లి జిల్లా అధ్యక్ష ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని తెలిసింది. వీరితోపాటు జిల్లా కమిటీలోనూ పదవులు ఉంటాయని.. ఇలా వందల మందికి పదవులు వస్తాయని నేతలు ఆశించారు. తాజాగా జిల్లా కమిటీలు ఉండవనే విషయం బయటికి రావడంతో పదవులు ఆశించిన వారు నిరాశకు గురవుతున్నారు.