‘మాయల పకీర్ వేషాలు మానుకో బాబూ’
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయల పకీర్ వేషాలు మానుకుంటే మంచిదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి హితవు పలికారు. రాజధాని నిర్మాణం పేరుతో బాబు చేస్తున్న హంగామా అరచేతిలో వైకుంఠం లాంటిదేనన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సింగపూర్ కంపెనీకి రూ.15 కోట్లు చెల్లించిన బాబు, భవనాల డిజైన్ల కోసం జపాన్‌కు చెందిన మకి కంపెనీకి రూ.97.50 లక్షలు చెల్లించారన్నారు. రాజధానికి నిధులు ఎలా సేకరించాలన్న సలహా ఇచ్చినందుకు మెకిన్సీ కంపెనీకి రూ.112 కోట్లు చెల్లించేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అడ్డగోలు దోపిడీకి బాబు తెరతీశారని పేర్కొన్నారు.
విభజన చట్టంలో సెక్షన్-6 ప్రకారం రాజధాని నిర్మాణానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సచివాలయం, రాజ్‌భవన్, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలని స్పష్టంగా ఉందన్నారు. మాస్టర్‌ప్లాన్, డిజైన్లు, ప్రజాభిప్రాయం, భూమి పూజలు, శంకుస్థాపనల పేరుతో బాబు ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే ఇలాంటి చీప్‌ట్రిక్స్ ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం చేతకాని బాబు రాజధాని నిర్మాణమెలా పూర్తి చేయగలరో చెప్పాలని తులసిరెడ్డి ప్రశ్నించారు.