'ఆత్మహత్యలంటే మూతిపై కొట్టమన్నారు'
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితి సంక్షోభంలోకి వెళ్లిపోయిందని, రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ శాసన సభలో రైతుల ఆత్మహత్యలపై మాట్లాడుతూ 16 నెలలుగా ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. ఇప్పటివరకు 1400 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్కమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ వారి కుటుంబాలను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో జరిగేది రైతు ఆత్మహత్యలు కాదని, గత ప్రభుత్వ పాలకుల లోపం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని స్వయంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి కేటీఆర్ అన్నారని చెప్పారు. ఆత్మహత్యలంటే మూతిపై కొట్టండి అంటూ మంత్రులు, లక్ష్మారెడ్డి, జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవారు బాధ్యత లేకుండా మాట్లాడటం బాధాకరమని చెప్పారు.
బ్యాంకులు రుణాల విషయంలో వడ్డీ మాఫీ లేదని, ప్రభుత్వం ఇచ్చిన ఇన్ స్టాల్ మెంట్స్ వడ్డీకే జమ చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల విషయంలో మారిటోరియం అమలు చేసిందన్నారు. దీంతోపాటు గత యాభై ఏళ్ల కింద ఉన్న వ్యవసాయ పరిస్థితిని నేటి వ్యవసాయ పరిస్థితిని వివరించారు.