హైదరాబాద్: రైతులు ఏడిస్తే తొలుత కళ్లల్లో నీళ్లు వచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్కేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం అసెంబ్లీ శాసనసభలో రైతుల ఆత్మహత్యల ఘటనపై మాట్లాడుతూ రైతుల విముక్తి సాధన ఉద్యమం కేసీఆర్ చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చేసినా రైతుల కోసమే చేశారని, ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, చెరువుల పూడిక తవ్వకాలు, హరిత హారం వంటి కార్యక్రమాలన్నీ కూడా రైతులకు భవిష్యత్ తరాల కోసమేనని చెప్పారు. ఎద్దు ఏడ్చినచోట ఎవుసం నిలవదని, రైతు ఏడ్చిన చోట రాజ్యం ఉండదని, రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారని తెలిపారు.
రాజోలి బండ తూము పగులకొట్టినప్పుడు ప్రతిపక్షాలు నవ్వుతుంటే 102 డిగ్రీల జ్వరంతో ఉండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేశారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణపై ప్రతిపక్ష పాత్రే, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే విపక్షాలు పోషిస్తున్నాయని, వారిది పూర్తిగా సవతి ప్రేమేనని బాల కిషన్ ఆరోపించారు. ఈ సమయంలో జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. ఇప్పుడు రైతులకు కావాల్సింది భరోసా, ఆత్మస్థైర్యం అని చెప్పారు. కడుపులో నెలలు నిండని బిడ్డ గురించి ఆలోచించే తమ ముఖ్యమంత్రి రైతుల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారని, ఒక్కసారి అంతా గుండెమీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలని తెలిపారు.
'రైతు ఏడిస్తే కేసీఆర్ ఏడుస్తారు'
Published Wed, Sep 30 2015 11:48 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement