డబ్బులిచ్చి అవార్డులు తెచ్చుకున్న కేటీఆర్: ఉత్తమ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై ఉత్తమ్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్లో పేర్కొన్న వివరాలన్నీ తప్పుడు లెక్కలని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల్లో నెంబర్ వన్ చేయడంలో కేసీఆర్ విజయం సాధించారే తప్ప ఎక్కడా ప్రగతి సాధించలేదని దుయ్యబట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనీ, ముందస్తు ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ పేర్కొన్నారు.
'జీడీపీ ఎవరు నిర్దారిస్తారో మంత్రి హరీష్ రావుకు తెలియకపోవడం శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంకెలు పరిగణలోకి తీసుకుని కేంద్రం జీడీపీ నిర్దారిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు అంకెలు కేంద్రానికి పంపుతోంది. సీఐజీ వెబ్ సైట్ నుంచి తీసుకున్న అంకెలనే నేను కోట్ చేసి చెబుతున్నా. సర్కార్ అంకెల గారడీతో ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయిన మాట వాస్తవం కాదా.. సోషల్ ఎకనామిక్ సర్వే లెక్కలు చెబుతున్నది తప్పా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సర్కార్ చెబుతున్న గొప్పలు అన్నీ అవాస్తవాలే. దేశంలో తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల్లో ఆరో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా' అని ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రశ్నించారు.
డబ్బులిచ్చి అవార్డులు తెచ్చుకున్నంత మాత్రాన కేటిఆర్ చెప్పే అబద్దాలు నిజం కావని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మొదలు పెట్టిన ఏ ఒక్క విద్యుత్ ప్లాంట్ అయినా ఉత్పత్తి మొదలు పెట్టిందా? ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని... దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. అవి సాధ్యం కాదని వాటినుంచి బయట పడేందుకు.. బీసీలకు తాయిలాలు ఇస్తూ కొత్త మోసాలకు తెరలేపారని అన్నారు. ఈ రాష్ట్రాన్ని లిక్కర్ లో నెంబర్ వన్.. పార్టీ పిరాయింపుల్లో నెంబర్ వన్ చేయడంలో కేసీఆర్ విజయం సాధించారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తీసుకొస్తున్న అప్పులపై ప్రశ్నించే హక్కు మాకుంది. కేటీఆర్ ఓ బచ్చా, రాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదనీ.. రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్న చరిత్ర కేటీఆర్ సొంతమని విమర్శించారు.
'హైప్ క్రియేట్ చేసేందుకు ప్రతి ఏడాది బడ్జెట్ లో అంకెలు ఎక్కువ చేసి చూపుతున్నారు. జర్నలిస్ట్ లకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల హామీ ఎటుపోయింది. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలు ఎటుబోయాయి. హెల్త్ కార్డులు పని చేయమని పరిస్థితి ఉన్నా.. ఎందుకు ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరడం లేదు' అని ఉత్తమ్ మండిపడ్డారు.