వికృత రాజకీయ క్రీడకు పరాకాష్ట
► సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ మండిపాటు
► ముందుగా మొదలుపెట్టిన టీఆర్‌ఎస్‌దే బాధ్యత: ఉత్తమ్
► కేసీఆర్..ఒళ్లు దగ్గర పెట్టుకో: భట్టి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడ వికృతంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాప్రతినిధుల కొనుగోలు కోసం టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రలోభాలు, బెదిరింపులు, ఆకర్షణలు శ్రుతిమించిపోయాయని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకోసం డబ్బులు ఇస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, అయితే దొరకని దొంగలు టీఆర్‌ఎస్‌లో చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలసి ఉత్తమ్‌కుమార్ గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణ కోసం అనేక వరాలు ఉన్నాయని అయితే, ప్రధాని మోదీ ఇవ్వరు.. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగరు అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు గురయ్యారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు రాచమర్యాదలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతపార్టీ ఎమ్మెల్యేలకు మూడు నెలల నుంచి అపాయింట్‌మెంటు ఇవ్వడం లేదని ఆరోపించారు. మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ దేశంలో తెలంగాణ ప్రజలు తల దించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు చూస్తూ సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను డబ్బులతో కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి సిగ్గులేని పనిచేస్తున్న కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దొరికినట్టుగానే కేసీఆర్ కూడా ఏదో ఒకనాడు దొరికిపోతారని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల వలసలపై జాతీయస్థాయి నిఘా సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సోనియాకు కృతజ్ఞతా దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా గాంధీభవన్‌లో సోనియాగాంధీకి కృతజ్ఞతా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఏ ఆకాంక్షల కోసం, ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అవేవీ టీఆర్‌ఎస్ పాలనలో నెరవేరడం లేదన్నారు. కేసీఆర్ రాజకీయ స్వార్థంతో సోనియా పేరులేకుండా పదో తరగతి పాఠ్యాంశాల్లో చరిత్రను రాయించారని, ఇలా చేస్తే ప్రజలు సహించబోరని మల్లు భట్టివిక్రమారృ్క పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎల్‌పీ నాయకులు కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, ఎంపీ వి.హనుమంతరావు, సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, నర్సారెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.