నేడు కాంగ్రెస్ నిరసన
కరెన్సీ కష్టాలపై కదన భేరి
కలెక్టరేట్ నుంచి ఏకశిల పార్కుకు మారిన వేదిక
పెద్ద ఎత్తున నిర్వహణకు పార్టీ శ్రేణుల సమాయత్తం
స్థల పరిశీలన చేసిన జిల్లా నాయకులు
వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిల భారత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తొలుత హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపాలని భావించినప్పటికి జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో వేదికను బాలసముద్రంలోని ఏకశిల పార్కు(జయశంకర్ స్మృతివనం)కు మార్చారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న సభాస్థలి వద్ద చేపట్టిన ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ రీజినల్ కోఆర్డినేటర్, కేరళ మాజీ శాసనసభ్యుడు పీసీ విష్ణునాథ్, జిల్లా పార్టీ పరిశీలకులు, పార్టీ సీనియర్ నా యకులు, కొత్త జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నట్లు తెలిపా రు.
కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగదు కష్టాలను తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలల్లో నిత్యావసరాల మేరకు నోట్లను అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై సుబేదారి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో రాజేందర్‌రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యదర్శి ఈవీ.శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మెడకట్ల సారంగపాణి, నా యకులు శ్రీనివాస్‌రెడ్డి, మానుపాటి శ్రీనివాస్, శ్యాం, రాజు, సమద్, గణేష్ పాల్గొన్నారు.