మన్మోహనమే నేటి సత్యం
కాంగ్రెస్ ఓటమి మన్మోహన్‌కు బాధాకరమే కావచ్చు. కానీ తదుపరి వచ్చే ప్రభుత్వం ఏదైనా 1991లో ఆయన ఆర్థిక మంత్రిగా నిర్ధేశించిన ఆర్థిక సంస్కరణల మార్గంలోనే నడవక తప్పదు. ఆ నిశ్చింతే ఆయనను విజేతగా నిలుపుతుంది.
విశ్లేషణ
‘‘నాపై ఎవరు తీర్పు చెబుతున్నా అది నా గురించి కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లు అసలు నన్ను అర్థం చేసుకున్నదే లేదు.’’
‘అనుకోకుండా అయిన ప్రధాని’ పదేళ్ల పాలనకు తెరపడుతుండగా వెలువడుతున్న తీర్పులను చూసి మన్మోహన్‌సింగ్ మొహంలో గుంభనపు నవ్వు వెల్లి విరుస్తూ ఉండాలి. జాతీయ ఆర్థిక, రాజకీయ జీవితాన్ని కనిపించీ, కనిపించకుండా శాసిస్తున్న ఆయనను అపార్థం చేసుకున్నవాళ్లే ఎక్కువ. యూపీఏ 2004 విజయంలోనూ, 2014 ఓటమిలోనూ కూడా ఆయన నిమిత్త మాత్రుడే. ఆయనను గొప్ప ఆర్థిక మంత్రిగానూ, అంతంత మాత్రపు లేదా అసమర్థ ప్రధానిగానూ విభజించి అంచనా కట్టేవాళ్లు ఒక్క విషయాన్ని విస్మరిస్తున్నారు.
1991లో ఆర్థిక మంత్రి పదవి, 2004లోప్రధాని పదవి ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తాను రాజ కీయ జీవిని కానని విస్మరించి ఆయన వాటిని గంతేసి అందుకున్నారనుకోవడం పొరబాటు. రాజకీయాలు, పదవులు ఆయన లక్ష్య సాధనకు పని ముట్లు మాత్రమే. మనసా, వాచా, కర్మణా నమ్మిన స్వేచ్ఛా విపణి విధానాలను ఆచరణలోకి తేగల సాధనాలు మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మార్కెట్ ఆర్థిక శాస్త్ర మత ప్రవక్త. కాబట్టే దూషణ, భూషణ, తిరస్కారాలకు అతీతంగా లక్ష్యంపైనే గురిని నిలపగలిగారు. ఇందిరాగాంధీ 1969లో చేపట్టిన బ్యాంకుల జాతీయకరణ విప్లవాత్మక చర్యగా ప్రసిద్ధి చెందింది.
2008 నాటి ప్రపంచ ద్రవ్య ఆర్థిక సంక్షోభం తాకిడికి మన ద్రవ్య వ్యవస్థ కుప్ప కూలకుండా కాపాడినది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగమేనని అంతా కితాబులిచ్చారు. ఆ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగమే ఇప్పుడు బలిపీఠంపైకి ఎక్కిం ది. ప్రధానికి సోనియాగాంధీ వీడ్కోలు విందును ఇచ్చిన బుధవారం రోజునే ఆర్‌బీఐ ప్యానెల్ ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయాలని సిఫారసు చేసింది! తదుపరి ప్రధాని నరేంద్రమోడీ అయితే ఆయన ఆ పని చేస్తారనడంలో సందేహం లేదు.
1991లో మన్మోహన్ ఆర్థిక మంత్రిగా నూతన ఆర్థిక విధానాల పేరిట వేసిన ఆర్థిక సంస్కరణల బాటలోనే మోడీ పయనిస్తారనడంలో సందేహం లేదు. కార్మిక చట్టాల ఉక్కు సంకెళ్లను బద్దలు కొట్టి ‘హైర్ అండ్ పైర్ విధానాన్ని’ (‘ఎగ్జిట్ పాలసీ’) అమల్లోకి తెస్తానని 1991లో చేసిన వాగ్దానాన్ని మన్మోహన్ నెరవేర్చలేదని వ్యాపార వర్గాలు వేలెత్తి చూపుతున్నాయి. మన్మోహన్ వాగ్దానాన్ని మోడీ తప్పక నెరవేరుస్తారు.
కార్మిక చట్టాల సవరణ మోడీ ఆర్థిక ఎజెండాలోని ముఖ్యాంశం! నిజమైన ప్రవక్త తన అస్తిత్వం కంటే తన సందేశం, ్రపబోధం వ్యాప్తికే ప్రాధాన్యం ఇస్తాడు. తన బోధనలు ఆచరణలోకి రావాలనే వాంఛిస్తాడు. కాంగ్రెస్ ఓటమి మన్మో
హన్‌కు బాధాకరమే కావచ్చు. కానీ తదుపరి ప్రభుత్వం ఆయన నిర్దేశించిన మార్గంలోనే నడవక తప్పదనే నిశ్చింతే ఆయనను విజేతగా నిలుపుతుంది.
ప్రజా నాయకుడు కాకపోవడమే మన్మోహన్ పెద్ద బలహీనతని అంటున్నారు. ప్రజానాయకులు కానివారే చక్రం తిప్పుతున్న ప్రభుత్వానికి ఆయన సారథి. రాజకీయ విన్యాసాలు, ఎత్తుగడలను సోనియా నేతృత్వంలోని అలాంటి నేతలకే ఆయన వదిలేశారు. అలా అని తన లక్ష్య సాధనకు అడ్డం కిగా నిలిచే వారిని విడిచి పెట్టలేదు. అణు ఒప్పందం విషయంలో సోని యాను సైతం ధిక్కరించి వామపక్షాలతో ఆయన తెగతెంపులు చేసుకున్న విషయాన్ని చాలా మందే గుర్తిస్తున్నారు.
కాకపోతే ఆ సాకుతో ఆయన వామపక్షాలను వదుల్చుకోగలిగారని గుర్తించే వారు తక్కువ. గ్రామీణ ఉపాధి నుండి సమాచార హక్కు వరకు యూపీఏ 1 పథకాలన్నీ తమ ఒత్తిడి ఫలితమేనని సీపీఎం నేత కారత్ అనడం అతిశయోక్తి. రాజకీయవేత్త సోనియాకు ఎన్నికల ప్రయోజనాలే ఏకైక లక్ష్యం. అందుకే ‘జనాకర్షక పథకాలు’గా మన్మోహన్ మార్కెట్ ఆర్థిక మతం తూలనాడే పథకాలే అవసరమయ్యాయి.
వైఫల్యాలే విజయాలు
ఆర్థిక సంస్కరణల తాకిడికి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం తాకిడి కి వెల్లువెత్తునున్న అంసతృప్తిని మన్మోహన్ ముందే గ్రహించారు. కాబట్టే 2009 ఎన్నికల నాటికి వామపక్షాల పీడ విరగడ చేసుకున్నారు. నిరాటంకంగా ఈ చేత్తో ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చిన వాటిని ఆ చేత్తో సబ్సిడీల ఉపసంహరణ వంటి చర్యలతో లాక్కోగలిగారు. ధరల పెరుగుదలను అరికట్టలేనందుకు మన్మోహన్‌ను కాంగ్రెస్ నేతలు సైతం తప్పుపడుతున్నారు. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం ధరలను నిర్ణయించేది మార్కెట్ శక్తులే తప్ప ప్రభుత్వం కాదు. తనది కాదనుకున్న పనిని చేయలేదని విమర్శించడం ఏం సబబు? స్పెక్ట్రమ్, బొగ్గు తదితర కుంభకోణాలను అరికట్టడంలో విఫలమయ్యారని మన్మోహన్‌పై మరో విమర్శ.
ఇలాంటి కుంభకోణాల ఆర్థికతను ఆశ్రీత పెట్టుబడిదారీ విధానంగా పిలుస్తున్నారు. ఇందులో ప్రభుత్వ ఆస్తులతో లబ్ధి పొందేవారు, బదులుగా ముడుపులు పుచ్చుకునేవారు ఉంటా రు. ఆశ్రీత పెట్టుబడిదారీ విధానానికి రాజకీయ అవినీతి ఒక కొస అయితే కార్పొరేట్ దిగ్గజాలు, బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు మరొక కొస. ప్రభుత్వంలోని, అధికార యంత్రాంగంలోని అవినీతికి మన్మోహన్ వ్యతిరేకమే. కానీ రెండో కొసన ఉండే వారి పట్ల ఆయన దృష్టి విభిన్నమైనది. మీడియా సామ్రాజ్యపు చక్రవర్తిగా వెలిగిన రూపర్ట్ మర్డోక్ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం ప్రపంచాన్ని కుదిపేస్తుండగా ‘ఎకానమిస్ట్’ పత్రిక కాలమిస్టు థామస్ ఫ్రీడ్‌మాన్ ఒక విలువైన మాట చెప్పారు:
‘‘గొప్ప వ్యాపార ఆవిష్కర్తల పేర్లు ఎప్పుడూ అక్రమ వ్యాపార పద్ధతులతో ముడిపడి ఉండటం సర్వసాధారణమే.’’ మన్మోహన్‌దీ అదే మతం. ప్రధానిగా అలాం టి మాటలు చెప్పలేకపోయారంతే. సరిగ్గా ఈ కొసను పట్టుకుని లాగబట్టే కేజ్రీవాల్ కార్పొరేట్ అధిపతులకు అంటరానివాడయ్యారు. మన్మోహన్... కేజ్రీవాల్ కాదు. అవినీతిని నిర్మూలించే చాంపియన్‌నని ఎన్నడూ చెప్పలేదు. ఆయనది మార్కెట్ ఆర్థిక విధానాల జెండా. ద్వంద్వ అధికారంగా పేర్కొం టున్నది సోనియా, మన్మోహన్‌ల మధ్య అధికారాల విభజన మాత్రమే. కార్పొరేటర్‌గా సైతం గెలవలేని తనను ప్రధాని పదవిలో కూర్చోబెట్టిన సోనియాకు రుణపడి ఉండలేని కృతఘు్నలు ఆయన కారు. స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని కూడా చక్కబెట్టుకోవడమే లౌక్యం. మన్మోహన్‌కు మార్కెట్ ఆర్థిక సిద్ధాంతాలకు మించిన స్వకార్యం మరొకటి లేదు.
విశ్వాసి.. మూఢ విశ్వాసి
మన్మోహన్ మొదటి, రెండవ పదవీ కాలాలను విడదీసి మొదటి దశలో అయనను అత్యుత్తమ ప్రధానిగా ఆకాశానికెత్తుతూ, రెండో దశలో అసమర్థ, నిరర్థక ప్రధానిగా తెగనాడటం విమర్శకుల దురలవాటు. 1991 నుంచి అమలవుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల సంపన్న వర్గాలతో పాటు మధ్య తరగతిలోని కొన్ని అంతస్తుల ఆదాయాలు పెరిగిన మాట నిజమే. వియోగదారుని ఎంపిక స్వేచ్ఛ పేరిట విచ్చలవిడి వినియోగం గాలిమేడల్లో నివసించే వారి సంఖ్య పెరిగిన మాట కూడా నిజమే. కానీ ఇటీవలి ఎన్‌ఎస్‌ఎస్ గణాంకాలు.. 1983 తదుపరి సంస్కరణలు అమలైన కాలంలో (2010 వరకు) గ్రామాల్లో రోజుకు ఆహార వినియోగం కేలరీల్లో 16 శాతం తగ్గింది! పైగా నెలకు తలసరి వినియోగ వ్యయం 28 శాతం పెరుగుతుండగా, గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతలతో పేదరికం తగ్గిందంటుండగా బయటపడ్డ ఈ చేదు వాస్తవం మన్మోహన్ మార్కెట్ మతానికి ఉన్న చీకటి పార్శ్వానికి అద్దం పడుతుంది.
మన్మోహన్ ప్రధానిగా మొదటి దశ అద్భుత వృద్ధి (8.42 సగటు వార్షిక వృద్ధి రేటు) కాలంలోనే పారిశ్రామిక, వ్యవసాయ రంగాల క్షీణత మొదలైంది. వస్తు తయారీ రంగం 7.57% నుంచి 5.92%కు వ్యవసాయరంగంలో వృద్ధి 3.43 నుంచి 2.7%కు పడిపోయింది. నేడు పారిశ్రామిక వృద్ధి రుణాత్మక స్థాయికి చేరింది. నేటికీ వ్యవసాయం, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలే అత్యధికులకుఉపాధిని కల్పిస్తున్నాయి. అవే నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిరుద్యోగానికి కారణమయ్యాయి. అతి సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్‌కు పేదల పట్ల పట్టింపు లేదనుకోవడం పొరపాటు.
‘వృద్ధి ముందు, పంపిణీ తర్వాత’ అనేది ఆయన మతం. వృద్ధితో పై వర్గాలు సంపన్నవంతమైతే బొట్టుబొట్టుగా అట్టడుగు వర్గాలకు వృద్ధి ఫలాలు అందుతాయని ఆయన విశ్వాసం...మూఢ విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ఆయన పని చేశారు. అయినా కార్పొరేట్ ప్రంపంచం ఆయనపై కృతజ్ఞత చూపలేదు. 2013 సెప్టెంబర్లో ‘నీల్సన్-ఎకనమిక్ టైమ్స్’ నిర్వహించిన సర్వేలో 100 మంది కార్పొరేట్ అధిపతుల్లో 74 మంది మోడీకి జై కొట్టారు. మన్మోహన్ ఆలాంటివి పట్టించుకునే బాపతు కాదు. నిజమైన విశ్వాసి...మూఢ మార్కెట్ ఆర్థిక మత విశ్వాసి.
పిళ్లా వెంకటేశ్వరరావు