ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు కుట్ర
ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు కుట్ర
Published Mon, Sep 26 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
– బీఎస్‌ఎన్‌ఎల్ ఈయూ జిల్లా కార్యదర్శి డి.వెంకట్రామిరెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు కుట్ర జరుగుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ ఈయూ జిల్లా కార్యదర్శి డి.వెంకట్రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.యాకోబ్ ఆరోపించారు. సోమవారం స్థానిక పాతబస్టాండు సమీపంలోని సీటీవో కార్యాలయంలో యూనియన్ ప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2016–17 బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో రూ. 56,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణను ప్రతిపాదించిందన్నారు. నీతి అయోగ్ 74 సీపీఎస్‌ఈలను మొత్తంగా విక్రయించడానికి సమగ్ర ప్రతిపాదనను ప్రధానమంత్రికి ఇచ్చిందన్నారు. రక్షణ, బొగ్గు, చమురు, గనులు, విద్యుత్, టెలికాం, ఏవియేషన్ నిర్మాణం, ఇన్సూరెన్స్, పెన్షన్, బ్యాంకింగ్, రైల్వే, మల్టీబ్రాండ్ రిటైల్, ఫార్మా వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. కీలకమైన రక్షణ, మందుల తయారీ రంగాల్లో వంద శాతం ఎఫ్‌డీఐల అనుమతులు దేశ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పెట్టుబడులను 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవడం ప్రమాదకరమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, అధికారులు, కార్మికులు సంఘటితమై కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఈయూ సహాయ కార్యదర్శి రామరాజు, ఓబీ రామకష్ణుడు, ఏఐబీడీపీఏ కోశాధికారి ఎం.రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement