కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు 19కి వాయిదా
సాక్షి, అమరావతి : వార్దా పెను తుపాను కారణంగా తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో జరగాల్సిన కానిస్టేబుల్ పోస్టుల దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీపోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9 నుంచి నెల్లూరు జిల్లా కావలిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ నెల 12 నుంచి జరగాల్సి ఉంది. తీరంలో పెను తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోను దేహదారుఢ్య పరీక్షలను ఈ నెల 19 నుంచి నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 1 నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తయ్యి మరికొన్ని జిల్లాల్లో యధాతథంగా కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావం ఉన్న నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో మాత్రం వాయిదా నిర్ణయం తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10,810 మంది పురుషులు, 1,101 మహిళలు, నెల్లూరు జిల్లాలో 5,453 మంది పురుషులు, 317 మంది మహిళా అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది.