
కరెంట్ తీగలు తగిలి దగ్ధమైన కంటైనర్, కార్లు
చిత్తూరు: కార్లతో వెళ్తున్న కంటెయినర్‌పై విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలో వాహనంతోపాటు అందులోని కార్లు దహనమయ్యాయి. కంటెయినర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన బుధవారం ఉదయం చిత్తూరు సమీపంలో చోటుచేసుకుంది.
జార్ఖండ్ రాష్ట్రం కొటాను జిల్లాకు చెందిన కంటెయినర్ డ్రైవర్ ఆలం(27) బుధవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి ఎనిమిది కార్లను లోడ్ చేసుకుని బయలుదేరాడు. చిత్తూరు నగరంలోని ఇరువారం గ్రామం వద్ద ఉన్న ఎన్‌హెచ్-4 జాతీయ రహదారి కూడలిలో కిందికి వేలాడుతున్న 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలను గమనించకుండా వాహనాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఆ తీగలు కంటెయినర్‌కు పట్టుకోవటంతో తెగి లారీపై పడ్డాయి. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో వాహనానికి మంటలు వ్యాపించాయి.
అప్పటికే షాక్‌తో డ్రైవర్ ఆలం కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఆ వాహనంలోని అయిదు కార్లు పూర్తిగా కాలిపోయాయి. మూడు కార్లు పాక్షికంగా కాలాయి. లారీలో క్లీనర్ లేకపోవడంతో ప్రమాదాన్ని పసిగట్టే వీల్లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.