మంథని జేఎన్టీయూలో ఆగని ఆందోళన
-
రెండో రోజూ తరగతుల బహిష్కరణ.. కాలేజీ బ్లాక్ వద్ద ధర్నా
-
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్న విద్యార్థులు
సెంటినరీకాలనీ : సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు రెండో రోజైన గురువారం కూడా తరగతులను బహిష్కరించి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు కళాశాల బ్లాక్ ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు బైటాయించారు. అధ్యాపకులు, సిబ్బంది లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కళాశాలలో పర్మినెంట్ ఫ్యాకల్టీ లేదని, వైఫై సౌకర్యం, డిస్పెన్సరీ, జనరేటర్ ఏర్పాటు చేయలేదని, అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయని, గ్రంథాలయంలో సరైన పుస్తకాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన ఆపేది లేదన్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ప్రిన్సిపాల్ నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తు విద్యార్థులు మండిపడ్డారు. ప్రిన్సిపాల్ మార్కండేయులు విద్యార్థులతో చర్చించారు. అయితే సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేదిలేదని విద్యార్థులు స్పష్టం చేశారు.