
ఎస్పీ గారూ.. మీరెమంటారు?
ఓ కాంట్రాక్టర్ తన పనుల కోసం ఏకంగా పోలీసు ఔట్ పోస్ట్‌నే కబ్జా చేసేశాడు. అందులో సిమెంటు, ఇతర సామగ్రిని నింపేసి స్టోర్ రూమ్‌గా మార్చుకున్నాడు. ఇదెక్కడి చోద్యమని అనుకుంటున్నారా! ఔనండి ఇది అక్షర సత్యం. ఎక్కడా కాదు.. జిల్లా కేంద్రం అనంతపురంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అది కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో వైజంక‌్షన్‌లోనే!! ఇటీవల ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టారు. ధర్మవరం నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన కంపెనీకి ఈ పనుల కాంట్రాక్ట్ అప్పగించారు.
దీంతో అక్కడే ఉన్న పోలీస్ ఔట్ పోస్టు తలుపుల తాళాలను బద్ధలుగొట్టి దానిని సిమెంట్, సామగ్రిని ఉంచి స్టోర్ రూంగా మార్చుకున్నాడు. ఇంతా జరిగినా వన్‌టౌన్ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బతుకు తెరువు కోసం తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారు రోడ్డుపై కొద్దిగా ముందుకు వస్తే నిప్పులు చెరుగుతూ.. చిర్రుబుర్రులాడే పోలీసులు.. తమ ఔట్‌పోస్టును కబ్జా చేసిన కాంట్రాక్టర్ విషయంలో నోరు మెదపకపోవడం గమనార్హం. అధికార పార్టీ దురాగతంపై జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జీవీజీ అశోక్‌కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
- అనంతపురం సిటీ