ఉద్యోగ భద్రత కల్పించాలి
మధురానగర్ : 16 ఏళ్లుగా కాంట్రాక్టు లెక్చరర్స్‌గా పనిచేస్తున్న లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని గవర్నమెంట్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎం దయాకర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్ డిమాండ్ల పరిష్కారం కోరుతూ శనివారం ప్రభుత్వ కళాశాలలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామన్నారు. జీతాలు చాలక కుటుంబాలు అర్ధాకలితో, పిల్లలకు కనీస అవసరాలు తీర్చలేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని చెప్పిన పాలకులు నేడు తమను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలుచేయని ప్రభుత్వాలు, తమను క్రమబద్ధీకరించటానికి మాత్రం సుప్రీం కోర్టు అభ్యంతరం చెప్పిందంటూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో జీఓ 16 ప్రకారం 2–94 యాక్ట్‌ను సవరించిందని, ఏపీలో తమ గురించి ఆలోచించిన వారే కరువయ్యారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు జీతాలను రెట్టింపు చేసుకునేందుకు నిధుల సమస్యలు లేవని తమ వేతనాలు పెంచడానికి, క్రమబద్ధీకరించడానికి నిధుల కొరత కనిపించడం హేయమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీ ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేశామని, 21 నుంచి 23 వరకు పోస్టుకార్డు ఉద్యమం, 24, 25 తేదీలలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించటం, 28న కలెక్టరేట్‌వద్ద ధర్నా, డిసెంబర్ 1న కుటుంబ సభ్యులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే డిసెంబర్ 2 నుంచి నిరవధిక దీక్షలను చేపడతామని హెచ్చరించారు. జిల్లా నాయకులు జాన్సన్, విజయశ్రీ,, రాంబాబు, సుధాకరన్, జ్యోతి, సునీత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.