అవినీతి ల్యాండ్
కాసులు కురిపిస్తున్న వెబ్‌ల్యాండ్
- రాత్రికి రాత్రి మారిపోతున్న భూమి వివరాలు
- రెవెన్యూ కార్యాలయాల్లో దందా
- ధనవంతుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు
- నేడు తహసీల్దార్లతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష
అనుగొండకు చెందిన రైతు అయ్యన్న తన కొడుకును ఫిలిపిన్స్‌లో మెడిసిన్ చదివిస్తున్నాడు. రెండవ సంవత్సరం వాయిదా డబ్బు కట్టేందుకు తనకున్న 3.03 సెంట్ల భూమిని అమ్ముకున్నడు. 118/1 సర్వేలో ఉండాల్సిన భూమి వివరాలు ఆన్‌లైన్‌లో 118/సి1 ,118/సి2 పేరిట నమోదయ్యాయి. ఆన్‌లైన్‌లో వివరాలు సరిగ్గా నమోదు చేయిస్తే తప్ప రిజిస్టర్ చేయమని సబ్ రిజిస్ట్రార్ చేప్పడంతో భూమి కొనుగొలుదారులు డబ్బివ్వకుండా వాయిదా వేశారు. ఆన్‌లైన్‌లో వివరాలు సరి చేసేందుకు రెవెన్యూ ఆ«ధికారులు డిమాండ్ చేశారు. అంత డబ్బు రైతు ఇవ్వలేక 6నెలల నుంచి రెవెన్యూ కార్యాలయం చూట్టూ తిరుగుతున్నడు.
-
ప్యాలకుర్తిలో జర్మన్ యూనిస్‌బాషాకు సర్వే నెం.431/3లో పెద్దల ఆస్తి 2.18 సెంట్ల భూమి సంక్రమించింది. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి డాక్యుమెంట్లు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు లక్ష రూపాయల లంచం తీసుకొని తెలుగుదేశం పార్టీ నేత జుట్ల వెంకటరాముడు 46సెంట్ల భూమి అనుభవిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. దిక్కుతోచని రైతు యూనిస్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
- ఇవీ రెవెన్యూ లీలలు.
కోడుమూరు: కోడుమూరు మండలంలో రెవెన్యూ అ«ధికారులు ఒకరి భూములను మరొకరి పరం చేస్తున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నరు. తప్పు చేసిన అధికారులను శిక్షించకుండా ఉన్నతాధికారులు వదిలేస్తుండటంతో మండల స్థాయిలో ఇష్టారాజ్యం సాగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్వోలు కుమ్మక్కై రాత్రికి రాత్రి రైతుల పేర్లను మార్చేస్తున్నారు. వర్కూరు గ్రామంలో సర్వే నెంబర్ 326/ఎ2ఎ, 332/ఎలోని 1.22 ఎకరాలకు సంబంధించి సుబ్బలక్ష్మమ్మ అక్టోబర్ 10, 2015న ల్యాండ్ కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకుంది. రూ.13,176 ఫీజు(చలానా నెం.10734) చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయించుకొని ఆ భూమిని ప్లాట్లు వేసి విక్రయించారు. అయితే అదే భూమిని వ్యవసాయ భూమిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్ పుస్తకం రద్దు చేయకపోవడంతో సదరు రైతు బ్యాంకులో పంట రుణం, పంట నష్టపరిహారం పొందారు.
ప్యాలకుర్తి గ్రామంలో ఆర్వి వెంకటమ్మకు 863, 862/6, 862/4, 862/3,862/1 సర్వే నెంబర్‌లలో 7.35 ఎకరాల ఏడబ్ల్యూ భూమి ఉంది. వారసత్వంగా ఇద్దరు కొడుకులకు ఇవ్వకుండా చిన్న కుమారుడి భార్య అరుంధతికి ఆగస్టు 8, 2004న గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో(డాక్యుమెంట్ నెంబర్ 1423/2004) రిజిస్టర్ చేయించింది. వెంకటమ్మ పెద్ద కుమారుడు కోర్టును ఆశ్రయించడంతో కర్నూలు సివిల్‌కోర్టు ఆగస్టు 28, 2013న ఆ రిజస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అయినప్పటికీ అరుంధతి భారీ ఎత్తున రెవెన్యూ అధికారులకు డబ్బు ముట్టజెప్పడంతో మార్చి 3, 2017న 7.35 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేశారు. ఈవిధంగా కోడుమూరు మండలంలో వందల ఎకరాలను ఇష్టానుసారంగా ఆన్‌లైన్‌లో మార్చేస్తూ తహసీల్దార్లు లక్షలాది రూపాయలను రైతుల నుంచి దోచుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
ప్రక్షాళన జరిగేనా?
కోడుమూరు మండలంలో ఇష్టానుసారంగా ఆన్‌లైన్‌లో పేర్లను తొలగిస్తున్నారనే విషయాన్ని గత జాయింట్ కలెక్టర్ హరికిరణ్ సాక్ష్యాధారాలతో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమక్షంలోనే విచారణ నిర్వహించారు. అయినప్పటికీ చర్యలు కరువయ్యాయి. తాజాగా ఈ నెల 12న కర్నూలులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన తహసీల్దార్లతో వెబ్‌ల్యాండ్‌పై సమీక్ష నిర్వహించనున్నారు. మరి ‘సాక్షి’ సాక్ష్యాధారాల నేపథ్యంలోనైనా రెవెన్యూ ప్రక్షాళనకు డిప్యూటీ సీఎం చొరవ చూపుతారా? ఎప్పటిలానే మమ అనిపిస్తారా? చూడాలి.