సంక్షేమం నాస్తి.. సంపాదన జాస్తి! | corruption in icds | Sakshi
Sakshi News home page

సంక్షేమం నాస్తి.. సంపాదన జాస్తి!

Published Fri, Jan 20 2017 11:34 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

corruption in icds

– అవినీతి నిలయాలుగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు
– చిన్నారుల పొట్టకొట్టి దర్జాగా వసూళ్లు
– అన్నింట్లోనూ సీడీపీఓల చేతివాటం
– సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బందికీ వాటాలు


ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ఏర్పాటు చేసిన సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్‌) అక్రమాలకు నిలయంగా మారింది. ఈ పథకానికి ప్రభుత్వాలు కేటాయిస్తు‍న్న నిధులను కొందరు అవినీతి అధికారిణులు స్వాహా చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలను నివారించాల్సిన సీడీపీఓలు, జిల్లా ఉన్నతాధికారులే అవినీతిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి వసూళ్లకు పాల్పడడం.. కాదూ కూడదంటే వేధింపులకు గురిచేయడం రివాజుగా మారింది. అధికారుల ఇళ్లలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఆ ఆర్థిక భారాన్ని కార్యకర్తలపై మోపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అనంతపురం టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,286 మెయిన్‌, 840 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. 4,082 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3,698 మంది ఆయాలు పని చేస్తున్నారు. ఈ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సూపర్‌వైజర్లు, అసిస్టెంట్‌ సీడీపీఓలు, సీడీపీఓలు, అసిస్టెంట్‌ పీడీ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌పై ఉంటుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. అవినీతికి అలవాటుపడిన పలువురు పర్యవేక్షణాధికారులు సరుకులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల వద్ద పర్సెంటేజీలకు కక్కుర్తి పడి బిల్లులు చేస్తున్నారు. కొందరైతే అంగన్‌వాడీ కార్యకర్తలనూ మామూళ్ల కోసం పీడిస్తున్నారు. వారి నుంచి బహుమతులు, పట్టుచీరలు లాంటివి తీసుకోవడమే కాకుండా చివరకు ఇళ్లలో పనులు చేసేందుకు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను వినియోగించుకుంటున్నారు. సెక్టార్‌ లీడర్ల స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ఎవరి వాటాలు వారికి ఉండడంతో అక్రమాలు సాఫీగా సాగిపోతున్నాయి.
 
– శింగనమల ప్రాజెక్ట్‌ పరిధిలోని ఓ అధికారి చేతివాటానికి హద్దేలేకుండా పోతోంది. తన పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్ల నుంచి నెలవారీగా సరుకులు ఇవ్వకపోతే ఇంక అంతే సంగతి. బుక్కరాయసముద్రం మండలంలోని ఓ అంగన్‌వాడీ కార్యకర్త ఏకంగా సదరు అధికారి ఇంట్లో పనులు చేసేందుకే పరిమితమవుతోంది. ఓ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వండిపెడితే ఆ ఆహారాన్ని సెంటర్‌లోని పిల్లలకు పెడుతూ సరుకులను అమ్ముకుంటున్న పరిస్థితి.
– గతంలో కదిరిలోని ఓ ప్రాజెక్ట్‌లో పని చేసిన అధికారి అక్కడ అక్రమాలకు పాల్పడ్డారు. నాలుగేళ్ల క్రితం జరిగిన నియామకాల్లోనూ పెద్దఎత్తున వసూలు చేశారు.  ఈ విషయం తెలియడంతో ఇక ఇంటికి పంపించేస్తారని భావించి అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని ఓ ప్రాజెక్ట్‌కు బదిలీ చేయించుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి చేరిన ఓ నాయకుడి అనుచరుల అండతో అక్రమాలు కొనసాగిస్తున్నారు. వసూళ్ల కోసమే ప్రత్యేకంగా ఇద్దరు ఉద్యోగులను నియమించుకున్నట్లు విమర్శలున్నాయి.
– చెన్నేకొత్తపల్లి ప్రాజెక్ట్‌ పరిధిలోని అధికారి ఏకంగా సరుకులను బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని నడుతున్న మహిళ కొడుకు గతంలో అనంతపురంలో ఓళిగ సెంటర్‌ నిర్వహించేవాడు. ఇప్పుడు ధర్మవరంలో ఉంటున్నాడు. ఇక్కడి కేంద్రాల నుంచి సదరు ఓళిగ సెంటర్‌కు సరుకులు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కీలక టీడీపీ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో పాటు తమకూ వాటా వస్తుండడంతో పట్టించుకోవడం లేదు.
– ధర్మవరం ప్రాజెక్ట్‌లోని ఓ అధికారి ఏకంగా ‘పచ్చ’కండువా వేసుకుని పని చేస్తున్నారు. బత్తలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తను తన వెంటబెట్టుకుని ‘రాజకీయం’ చేయడం.. వసూళ్లకు పాల్పడడం చేస్తున్నారు. పైగా గతంలో కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్‌ సైతం నిత్యం ప్రాజెక్ట్‌ కార్యాలయంలోనే తిష్టవేసి ఉంటాడు.
– మడకశిర ప్రాజెక్ట్‌లో బియ్యం, నూనె, కందిబేడలు సరి‘హద్దు’ దాటుతున్నాయి. ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తుండగా, ముగ్గురు సూపర్‌వైజర్లు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్నారు. గతంలోనూ పోస్టుల భర్తీకి సంబంధించి సదరు అధికారి కీలకంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
– హిందూపురం ప్రాజెక్ట్‌లోని ఓ అధికారి భర్త ఇక్కడ హల్‌చల్‌ చేస్తుంటాడు. టీడీపీ ప్రజాప్రతినిధి తర్వాత ‘సర్వం తానే’ అనుకుంటున్న వ్యక్తికి ఇతడు స్నేహితుడు కావడం.. ఈ విషయం అందరికీ తెలియడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా అతను ఎంత చెబితే అంత ఇవ్వాల్సిందే!
– కదిరిలోని ఓ ప్రాజెక్ట్‌ పరిధిలో ఽస్కూల్‌ సమీపంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలెవరూ లేకున్నా ప్రతినెలా సరుకులు మాత్రం సరఫరా అవుతున్నాయి. ఓ సూపర్‌వైజర్‌ మధ్యవర్తిత్వంతో వసూళ్ల పర్వం సాగుతోంది.
– గుత్తి ప్రాజెక్ట్‌ పరిధిలో కార్యాలయ ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో కమీషన్లకు కక్కుర్తిపడుతున్నారన్న విమర్శలున్నాయి.
– రాయదుర్గం ప్రాజెక్ట్‌లో ఓ సూపర్‌వైజర్‌దే పైచేయి. ఇక్కడ అమృత హస్తం అమలవుతుండడంతో పా‘పాల’కు పాల్పడుతున్నారు. టీడీపీ నాయకుడి అండదండలు ఉండడంతో ఎవరూ ఏం చేయలేరన్న ధీమాతో ఉన్నారు.
– కంబదూరు ప్రాజెక్ట్‌లో కార్యాలయ ఉద్యోగి ఒకరు ‘లోగుట్టు’ వ్యవహారం నడిపిస్తున్నారు. సెక్టార్‌ సమావేశాలు జరిగినప్పుడు పిల్లల సంక్షేమం గురించి కాకుండా వాటాలపైనే చర్చిస్తుండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement