నెట్టికంటుడి సాక్షిగా దోపిడీ
అసౌకర్యాలతో భక్తులు సతమతం
మౌలిక వసతుల కల్పనలో పాలకవర్గం వైఫల్యం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కసాపురంలో భక్తులు నిలువుదోపిడీకి గురువుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ఇక్కడి నెట్టికంటి ఆంజనేయ స్వామిని భక్తులు కొలుస్తున్నారు. జిల్లాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు భక్తులు వస్తుంటారు. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఏడాదికి రూ. 8 కోట్లకు పైగా ఆదాయాన్ని ఈ ఆలయం గడిస్తోంది. అంతేకాక రూ. 16 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయం వద్ద మౌలిక వసతులు కరువవ్వడంతో భక్తులకు అసౌకర్యాలు తప్పడం లేదు. ఈ లోపాన్ని ప్రైవేట్ వ్యక్తులు సొమ్ము చేసుకుంటూ దోపిడీకి తెరలేపారు.
కసాపురంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధానం వద్ద భక్తులు విడిది చేసేందుకు రామసదనం పేరుతో 30 వసతి గదులు, లక్ష్మణ సదనం పేరుతో 39, కేసరి సదనం పేరుతో 30 గదులే కాక తొమ్మిది నాన్ ఏసీ కాటేజీలు, ఏడు ఏసీ కాటేజీలు ఉన్నాయి. ఈ 115 గదులను కొన్నేళ్ల క్రితం దాతల సౌజన్యంతో నిర్మించారు. రామ, లక్ష్మణ సదనాల్లోని కొన్ని గదులు శిథిలమయ్యాయి.
వసతి కోసం తిప్పలు
కసాపురం ఆలయానికి సంబంధించిన వసతి గదులను అతి తక్కువ అద్దెకు భక్తులకు ఇస్తుంటారు. రూ. 10 నుంచి రూ. 70 లోపు అద్దెను వసూలు చేస్తుండడంతో చాలా మంది భక్తులు ఆలయ వసతి గదుల్లోనే బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక అద్దె రూపంలో తాము చెల్లిస్తున్న రుసుం ఆలయాభివద్ధికి దోహదపడుతుందన్న భక్తిభావం చాలా మందిలో వ్యక్తమవుతోంది. అయితే ఈ గదుల నిర్వహణపై దేవాదాయ శాఖ అధికారులు శీతకన్నేశారు. గదులు శిథిలావస్థకు చేరుకున్నాయంటూ వాటిని భక్తులకు అద్దెకివ్వడమే మానేశారు. కేసరి సదనంలోని 30 గదులను సిఫారసు ఉన్న భక్తులకు మాత్రమే రూ. 300 అద్దెతో ఇస్తున్నారు. వసతి గదులు దొరక్క పోవడంతో ఇక్కడకు వచ్చే భక్తులు గత్యంతరం లేక ప్రైవేట్ లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. ఈ బలహీనతను ప్రైవేట్ లాడ్జీ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క గదిని ఒక రాత్రికి రూ. 750 నుంచి రూ. వెయ్యి వరకు అద్దె వసూలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆలయ పరిసరాల్లో తెల్లవార్లు జాగరణ కునుకుపాట్లు పడుతున్నారు.
నిర్మాణానికే పరిమితమైన పీఏసీ
నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తుడికీ వసతి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో రూ.4.35 కోట్లతో యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ) నిర్మాణాన్ని చేపట్టారు. నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఈ పనులు నేటికీ పూర్తి కాలేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ భవనం నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
స్నానపు గదులు, మరుగుదొడ్ల కొరత
ఆలయం పరిసరాల్లో 2011లో దాదాపు రూ. 32 లక్షల వ్యయంతో మరుగుదొడ్లు, సాన్నపు గదుల నిర్మాణాలను చేపట్టారు. ఈ నిర్మాణాలను రెండు బ్లాక్‌లుగా విభజించి ఒక్కొ బ్లాక్‌లో 20 మరుగుదొడ్లు, ఎనిమిది స్నానపు గదులు ఉండేలా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. బ్లాక్–1 కింద ఆలయం ఎదుట చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం వల్ల అక్కడే ఏర్పాటు చేసిన తాగునీటి సంప్‌లో నీరు కలుషితమయ్యే ప్రమాదముందంటూ కొందరు అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ పనులు నిలిపివేశారు. ఇక ఆలయానికి తూర్పున చేపట్టిన బ్లాక్–2 నిర్మాణ పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా 2013లో అర్ధాంతరంగా నిలిచి పోయాయి. మరుగుదొడ్లు, స్నానపు గదుల సౌకర్యం లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలయ పరిసరాలను బహిర్భూమిగా మార్చేస్తుండడంతో పారిశుద్ధ్యం లోపిస్తోంది.
ప్రతిపాదనలకే పరిమితం
ఆలయ పరిసరాలను మరింత విస్తరించడంతో పాటు అక్కడి పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వ్యాపార కేంద్రాలను తొలగించి, కాశీవిశ్వేశ్వర ఆలయం సమీపంలో దాదాపు 95 గదులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టారు. రూ. 1.40 కోట్లతో 2014లో చేపట్టిన ఈ పనుల్లో గదుల నిర్మాణానికి కొండను తవ్వాల్సి రావడంతో అంచనా వ్యయాన్ని పెంచాలంటూ మరోసారి ప్రతిపాదనలు పంపారు. అంతేకాక షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆలయానికి దూరంగా ఏర్పాటు చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో స్థానిక వ్యాపారులు... ప్రజాప్రతినిధులను ఆశ్రయించి, రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చారు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.
నూతన పాలక వర్గంపై ఆశ
ఆలయ అభివద్ధికి సంబంధించి నాలుగేళ్లుగా కమిటీ ఏర్పాటు కాకపోపవడంతో ఎటు చూసినా అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. చేపట్టిన ఏ పనులూ పూర్తి కాక భక్తులకు అసౌకర్యాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఆలయ ట్రస్ట్‌కు సభ్యుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సౌకర్యాలు మెరుగు పడడమే కాక, దోపిడీకి తెరదించుతారన్న ఆశలు భక్తుల్లో వ్యక్తమవుతోంది.