అద్దెకు తెచ్చిన లైట్లు అమర్చిన బ్రిడ్జి ఇదే (ఇన్‌సెట్‌లో) లైట్లు తీసేసిన దృశ్యం
ఖరీదైన లైట్లను ఎత్తుకుపోయిన వైనం
బట్టబయలైన భద్రత డొల్లతనం
రైతుల పరిశీలనతో దొంగతనం గుట్టు రట్టు
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా) : ఫర్లాంగుకో పోలీసు... అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా.... మైలుకో పోలీసు చెక్ పోస్టు... కృష్ణా తీరంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు కల్పించిన భద్రత ఇది. పొలాల్లోనూ, నదిలోనూ ఎటు చూసినా పోలీసు బీట్లు, పడవల్లోనూ పహారాలే. అయినా దొంగలు సీఎం నివాస సమీపంలోనూ, సీఎం వెళ్లే దారిలో ఉన్న వంతెనల వద్ద ఉన్న లైట్లను (5000 వాట్ల సామర్థ్యం) ఎత్తుకుపోయారు.
విషయం బయటకు పొక్కితే తమ భద్రతలోని డొల్లతనం ఎక్కడ బయటపడుతుందోనంటూ భావించిన భద్రతా సిబ్బంది ‘ఎక్కడి దొంగలు అక్కడే... గప్‌చుప్’ అంటూ విషయం బయటకు రానీయలేదు. పోయిన లైట్లు ఖరీదైనవి కావడం, ముఖ్యమంత్రి ఇంటి వెనుకవైపు కారు చీకట్లు కమ్ముకోవడం, వంతెనల వద్ద చీకటి రాజ్యమేలుతుండడంతో జరిగిన దొంగతనం బయటకు రాకుండా మేనేజ్ చేసి ఉండవల్లి పంచాయతీని కొత్త లైట్లు వేయాలంటూ భద్రతా సిబ్బంది ఆదేశించారు. అయితే అంత బడ్జెట్ ఉండవల్లి పంచాయతీకి లేకపోవడంతో వారు లైట్లు ఏర్పాటు చేయలేమంటూ చేతులెత్తేశారు. కానీ భద్రతా సిబ్బంది సీఎం భద్రత పేరుతో ఒత్తిడి తేవడంతో తాత్కాలికంగా అద్దెకు లైట్లు తీసుకువచ్చి వెలుగులు నింపారు.
ఇంతవరకూ బాగానే ఉంది, కాకుంటే తీసుకొచ్చిన లైట్లకు పదిహేను రోజులు గడిచినా అధికారులు అద్దె చెల్లించకపోవడంతో ఆదివారం సదరు లైట్ల యజమాని తన లైట్లను తాను తీసుకుపోయాడు. ఇది గమనించిన కొందరు రైతులు లైట్ల తొలగింపుపై ప్రశ్నించడంతో పదిహేను రోజుల క్రితం జరిగిన దొంగతనం విషయం బయటకు పొక్కింది.