దంపతుల బలవన్మరణం కేసుపై డీఎస్పీ విచారణ
Published Thu, Apr 27 2017 1:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
జంగారెడ్డిగూడెం : దంపతుల ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. ఈ నెల 20వ తేదీన స్థానిక రాజుల కాలనీలో ఆటోమొబైల్ వ్యాపారి చిక్కాల సీతారామరాజు(రాజా), అతని భార్య శ్రీదేవి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే. ఆత్మహత్యకు పాల్పడే ముందు రాజా మూడు పేజీల సూసైడ్‌నోట్ రాశాడు. సూసైడ్ నోట్‌ను రాజా రాశాడా? లేక అతని భార్యతో రాయించి సంతకం పెట్టాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. రాజా చేతిరాతను, అతని భార్య శ్రీదేవి చేతిరాతను, సూసైడ్ నోట్‌ను హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. వీరిద్దరూ తాగిన విషం ఏమిటన్నది తెలియాల్సి ఉందని, ఇందుకోసం పోస్టుమార్టం నుంచి సేకరించిన నమూనాలను విజయవాడలో ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు పంపుతున్నామన్నారు. రాజా రాసిన సూసైడ్‌నోట్‌లో తన తల్లికి పట్టణానికి చెందిన గొట్టుముక్కల రాయపరాజు, ఆయన భార్య విజయలక్ష్మి, కొడుకు వంశీ రూ.14 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఆ సొమ్ము కోసం చాలా మంది పెద్దల చుట్టూ తిరిగానని, న్యాయం జరగలేదని రాజా పేర్కొనడంతో సూసైడ్ నోట్‌లో పేర్కొన్న పెద్దలను కూడా విచారిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే ఆటోమొబైల్ షాప్ కోసం స్థానికంగా ఉన్న ఓ బ్యాంక్‌లో రాజా రుణం తీసుకున్నాడని, దానిని కూడా సక్రమంగా చెల్లించడం లేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. రాజా ఎవరెవరి వద్ద అప్పులు తీసుకున్నది కూడా విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే గొట్టుముక్కల రాయపరాజు, కొడుకు వంశీలను అరెస్ట్ చేశారు.
Advertisement