ధర్మం కాదిది మీ ఖర్మం!
ధర్మం కాదిది మీ ఖర్మం!
Published Fri, Jul 28 2017 11:28 PM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
రెచ్చిపోతున్న గోమాఫియా
కేసులు నమోదవుతున్నా యథేచ్ఛగా రవాణా
ఎక్కడికక్కడ పకడ్భందీ ఏర్పాట్లు
కోట్ల రూపాయల్లో వ్యాపారం
బంగ్లాదేశ్, దుబాయ్‌లకు మాంసం ఎగుమతి
జంగారెడ్డిగూడెం:
భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుతున్నారు పాలు మూతులు బిగియగట్టి... నాటి స్వాతంత్య్రోద్యమ సంగ్రామంలో భరతఖండాన్ని గోమాతతో కవి అభివర్ణించారు. అదే విధంగా యుగాలకు ఆది అయిన కృతయుగం నాడే సకల దేవతలు ఒకే చోట కొలువై ఉండేలా గోమాతను సృజియించి, అందులో దేవతలు అణువణువై నిలిచిపోయారు. ఇలా ఎన్నెన్నో పూజలు అందుకున్న గోమాత నేడు తన ఆత్మఘోష వినిపిస్తోంది.
నేను గోమాతను. భరత ఖండంలో పవిత్రంగా నన్ను కొలుస్తారు. నా నుంచి పుట్టే ప్రతీ అంశం మానవులకే ధారపోస్తున్నాను. సాక్షాత్తు నన్ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు. గృహ ప్రవేశానికి నేను కావాలి. పూజా కార్యక్రమాలకు నేను కావాలి. ఔషధాలకు నా పొదుగు నుంచి వచ్చే పాలు, నా నుంచే వచ్చే మూత్రం, పేడ కావాలి. ఎన్నో రకాలుగా నేను మానవ జీవన గమనంలో భాగమై పోయాను. కృతయుగం నాటి నుంచి కలియుగం వరకు నన్ను పూజిస్తున్నారు. నా తనువు మొత్తం వ్యర్ధం లేని అర్థం. అటువంటి నన్ను నేడు కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు బలి చేస్తున్నారు. అమ్మ తరువాత అమ్మగా కొలిచే నన్ను మాంసం అంగడిలో విక్రయ వస్తువుగా మార్చి నా రక్తమాంసాలు అమ్ముకుంటూ నా ఉనికే రూపు మార్చేస్తున్నారు. నా నాలుగు కాళ్లను విరగ్గొట్టి, ట్రక్కులు, కంటైనర్‌లలో కుక్కి జీవశ్ఛవాన్ని చేసి కాసులు దండుకుంటున్నారు. జాలి కూడా చూపకుండా కర్కశంగా నాపట్ల వ్యవహరిస్తున్నారు. మీకిది తగునా.....
రెచ్చిపోతున్న మాఫియా:
గోమాత ఆత్మఘోష ఇలా ఉన్నప్పటికీ చాలామందికి కనీసం మానవత్వం లేకుండా పోతోంది. ఎవరికి వారే తమకేంటిలే అని గోవుల అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నారు. దీంతో గోవులను అక్రమంగా రవాణా చేస్తూ ’గో’మాఫియా రెచ్చిపోతోంది. దీనికి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు కూడా సహకరించడంతో పశువుల అక్రమ రవాణాకు అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. ఏటా కోట్లాది రూపాయలు ఈ అక్రమ రవాణా ద్వారా గో మాఫియా చేతులు మారుతోంది. ఒడిశా నుంచి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిగోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు లక్షలాది పశువుల అక్రమ రవాణా జరిగిపోతోంది. బంగ్లాదేశ్, దుబాయిలకు కూడా అక్రమంగా రవాణా జరిగిపోతోంది. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశువుల రవాణా యథేచ్ఛగా జరిగిపోతోందంటే అధికారుల ఉదాశీనత, పెచ్చరిల్లుతున్న గోమాఫియా పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి పశ్చిగోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా వాహనాలను సరిహద్దు దాటించడం వీరి పని. దీని కోసం వీరు పైలెట్‌లుగా కూడా వ్యవహరిస్తారు.
రాష్ట్ర సరిహద్దు నుంచి రవాణా:
ఒడిశా, రాష్ట్ర సరిహద్దు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి గోవులను ఆయా మార్కెట్‌లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటైనర్‌లలో పశువులను సామర్ధ్యానికి మించి లోడ్ చేసి పైన టార్పాలిన్ కప్పి రవాణా చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఎటువంటి ఆంటకాలు లేకుండా వాహనాలు వచ్చినప్పటికీ జిల్లాలోకి ప్రవేశించే సరికి పోలీసులకు సమాచారం అందడం, వెంటనే పోలీసులు లారీలను సీజ్ చేయడం జరుగుతోంది. అయితే కొందరు పోలీసులు పశువులు రవాణా చేస్తున్న వ్యక్తులతో కుమ్మక్కై లారీలను వదిలి వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రవాణా మరీ దారుణంగా తయారైంది. ఒక కంటైనర్‌ను రెండు అంచెలుగా విభజించి పైన కింద గోవులను విచక్షణ మరిచి మరీ కుక్కేస్తూ సుదూర ప్రాంతాలు రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని గోవులు ఊపిరి ఆడక, ఆహార పానీయాలు అందక మృతి చెందుతున్నాయి. అయినా రవాణాదారుల్లో ఎక్కడా మానవత్వం కనిపించడం లేదు.
పెద్దల ప్రమేయం:
ప్రభుత్వంలోని కొందరు పెద్దల ప్రమేయంతో ఏటా కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో మీడియా వ్యక్తులు కూడా ఉండటంతో మాఫియా పని సులభమవుతోంది. ఇటీవల కొయ్యలగూడెంలో పోలీసులు గోవులు రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని సీజ్ చేయగా సాక్షాత్తు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని, ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రితో స్వయంగా జిల్లా ఎస్పీకే ఫోన్ చేయించి వాహనాన్ని విడుదల చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికే కేసు నమోదు కావడంతో పోలీసులు చేతులెత్తేశారు.
దళారుల హవా:
పశువులను అక్రమ రవాణా చేసే వాహనాలకు దళారులు అండదండగా ఉంటున్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ కొంతమంది బృందాలుగా ఏర్పడి వాహనాలను జిల్లా దాటిస్తున్నారు. ఒకవేళ తమకు సంబంధించిన వాహనం కాకపోతే వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పోలీసులకు పట్టివ్వడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశువుల వాహనాలు జిల్లాను దాటించేందుకు దళారులకు ప్రతీనెలా లక్షలాది రూపాయలు గోమాఫియా ముట్టజెబుతోంది. చెక్‌పోస్టుల్లో కూడా వాహనాలను తనిఖీచేయకుండా మామూళ్ళు తీసుకుని వదిలివేస్తున్నారు.
పంథామార్చిన గో మాఫియా:
జిల్లా మీదుగా సరిహద్దును దాటించేందకు గోమాఫియా పంథాను మార్చింది. ఒకవేళ జిల్లాలో ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువుల వాహనాలను సీజ్ చేస్తే వాటిని గోశాలకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గోశాలకు తరలించడం, అక్కడి నుంచి తిరిగి మళ్లీ యథావిధిగా రవాణా చేయడం పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
తరలించడానికి రూ. లక్ష:
జిల్లా సరిహద్దు దాటించేందుకు ఒక్కొక్క వాహనానికి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నారు. దీనికి హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారులు నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. ఈ దళారులు వాహనాలు, సరిహద్దు దాటించే వ్యక్తులు అవసరమైతే పశువుల రవాణా చేసే వాహనానికి పైలెట్‌లుగా వ్యవహరిస్తారు. దీనిలో ప్రత్యేకంగా మీడియా వ్యక్తులు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో న్యాయపరమైన, చట్టపరమైన అడ్డంకులు తొలగించుకోవడానికి కిందిస్థాయి నుంచి హైకోర్టు వరకు న్యాయ సలహాదారులు ఎక్కడికక్కడ ఉన్నారంటే గోమాఫియా స్థాయి అర్థం చేసుకోవచ్చు.
రవాణా చేయాలంటే నిబంధనలు పాటించాల్సిందే:
ప్రివెన్షన్ ఆఫ్ యానియల్ యాక్ట్ 1960 (59 ఆఫ్ 1960)లోని సెక్షన్ 38 (1), (2) ప్రకారం పశువులను తరలించాలంటే కచ్చితంగా యాక్టులో పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించి రవాణా చేయాల్సి ఉంటుంది. గోవుల పరిమాణం, బరువుని బట్టి అవి స్వేచ్ఛగా తిరిగేలా రవాణా చేసే వాహనంలో ఖాళీఏర్పాటు చేయాలి. రోడ్డు ద్వారా గాని, రైల్వే ద్వారా గాని రవాణా చేసే సమయంలో రవాణా చేసే వాహనాన్ని బట్టి పశువులను నిర్ధేశించిన సంఖ్య మేరకే రవాణా చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో పాటు మేత, నీరు అందుబాటులో ఉండాలి. ఎటువంటి హింసకు గురికాకూడదు. ఇవన్నీ పాటించకపోతే యానియల్ క్రూయల్టీ యాక్టు ప్రకారం రవాణా చేసే యజమానులు, రవాణాదారులు కూడా శిక్షార్హులే.
08)నిఘా ఏర్పాటు చేశాం:
పశువుల అక్రమ రవాణా పై నిఘా ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ఇన్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేశాం. సాధ్యమైనంత వరకు పోలీసులే పశువుల అక్రమ రవాణా వాహనాలను పట్టుకుంటున్నారు. పశువుల అక్రమ రవాణా, కిక్కిరిసి రవాణా చేయడం నేరం. ఇకపై యానిమల్ క్రూయల్టీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటాం.
సీహెచ్ మురళీకృష్ణ, డీఎస్పీ, జంగారెడ్డిగూడెం
09) అక్రమ రవాణాను అడ్డుకోవాలి:
పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలి. పశువులను చాలా దారుణంగా కాళ్లు విరగ్గొట్టి ట్రక్కులో పడవేసి కిక్కిరిసి రవాణా చేస్తున్నారు. ఇది అమానుషమైన చర్య. దీనిని పూర్తి స్థాయిలో అడ్డుకోవాలి. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు ఒక గోసంరక్షణ శాల ఏర్పాటు చేయాలి. అప్పుడు పశువుల అక్రమ రవాణా సాధ్యమైనంత అడ్డుకోవచ్చు.
కొప్పాక శ్రీనివాసరావు, గో సంరక్షకుడు, జంగారెడ్డిగూడెం
10) మొగల్ పాలకులు సైతం గోహత్యను నిషేధించారు. భారతీయులైన మనం గోమాఫియాను అడ్డుకోలేకపోతున్నాం. గోసంరక్షణ పేరుతో దాడులు చేయడం అన్యాయం. కాని గోసంరక్షకులంతా సంఘ వ్యతిరేకులు కారు.
వేదుల జనార్ధన్, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్ చాలక్, కొయ్యలగూడెం
Advertisement
Advertisement