‘గో’ మాఫియా
‘గో’ మాఫియా
Published Sat, Jul 22 2017 12:19 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
ఎట్టకేలకు పోలీసుల్లో కదలిక
’గోమాఫియాపై దృష్టి
ఆవుల మృతితో కళ్లుతెరిచిన వైనం
గోసంరక్షణ సమితిపై కేసు
దర్యాప్తు ప్రారంభం
చిత్రహింసలు పెట్టారని సమితి నిర్వాహకుని ఆవేదన
సాక్షి ప్రతినిధి, ఏలూరు, దేవరపల్లి :
అక్రమంగా తరలి వెళ్తున్న గోవులు అత్యంత హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు పోలీసులు నిద్రమత్తు వీడారు. గో మాఫియాపై దృష్టి పెట్టారు. గోవులను అక్రమంగా రవాణా చేస్తూ చెరేగిపోతున్న మాఫియా ఆగడాలపై రెండు నెలల క్రితమే ’సాక్షి’ కథనం ఇచ్చింది. ఈ మాఫియాకు రాష్ట్రంలోని అధికార పార్టీలోని కొంతమంది ప్రజాప్రతినిధులు, కొంతమంది పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీలూ సహకరిస్తున్న విషయాన్ని బయటపెట్టింది. అయినా స్పందించని పోలీసులు తాజా ఘటనతో కళ్లుతెరిచారు.
తమదాకా వచ్చేసరికి...
బుధ, గురువారాల్లో అక్రమంగా తరలిపోతున్న గోవులను పోలీసులు పట్టుకున్నారు. వీటిల్లో 40 వరకూ మృత్యువాత పడటంతో ఆ శాఖలో కదలిక వచ్చింది.. 72 గోవులతో వెళుతున్న కంటెయినర్‌ను బుధవారం మ«ధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద త్యాజంపూడికి చెందిన గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నల్లజర్ల మండలం ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాసుకు సమాచారం వచ్చారు. అతను తమవద్ద ఖాళీ లేదని.. దేవరపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కంటెయినర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి రాత్రి 9 గంటల సమయంలో కాకినాడ ప్రభుత్వ గోసంరక్షణ సమితికి పంపించారు. అప్పటికే కంటెయినర్‌లో ఉన్న 30 గోవులు మృతి చెందినప్పటికీ దానిని కాకినాడ పంపించారు. అక్కడ నిర్వాహకులు గోవులను దించుకోవడానికి నిరాకరించారు. అక్కడి నుంచి గురువారం ఉదయం కంటెయినర్‌ను దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ ఆవపాడు వద్ద గల గోసంరక్షణ సమితికి పంపించారు. అయితే మృతి చెందిన గోవులను దించుకోవడానికి నిర్వాహకుడు శ్రీనివాస్ నిరాకరించాడు. బతికున్న వాటిని మాత్రమే తీసుకున్నాడు. మృతి చెందిన గోవులను లారీ డ్రెవర్ నల్లజర్లతాడేపల్లిగూడెం రోడ్డులో రోడ్డు పక్కన దింపుతుండగా.. పరిసర ప్రజలు అడ్డుకున్నారు. రాత్రి 11 గంటల సయంలో మృతి చెందిన 32 గోవుల కళేబరాలను దేవరపల్లి, నల్లజర్ల ఎస్సైలు కంటెయినర్‌తో తీసుకువచ్చి యర్నగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టున గొయ్యితీసి పాతిపెట్టారు. మిగిలిన వాటిని గోసంరక్షణ సమితికి అప్పగించారు.
చిత్రహింసలు పెట్టారు.
ఇదిలా ఉంటే గోవులను దించుకోవడానికి నిరాకరించడంతోపాటు కంటెయినర్ డ్రైవర్‌ను డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలతో గోసంరక్షణ సమితి నిర్వాహకుడు కొండ్రెడ్డి శ్రీనివాస్, సహాయకుడు రాఘవేంద్రరావును దేవరపల్లి ఎస్సై వాసు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి అక్కడ శ్రీనివాస్‌ను చిత్రహింసలకు గురిచేసిన అనంతరం రాత్రి 12 గంటల సమయంలో దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి దారుణంగా కొట్టినట్టు శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. పోలీసులు బాగా కొట్టడంతో అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు.
మంత్రుల దృష్టికి వివాదం
పోలీసుల చిత్రహింసలపై నిర్వాహకుడు హోంమంత్రి చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రుల జోక్యంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గతంలో జిల్లాలోని ఏయే పోలీస్ స్టేషన్ల పరిధిలో గోవులను స్వాధీనం చేసుకున్నారు. ఆవపాడు గోసంరక్షణ సమితికి ఎన్ని గోవులను అప్పగించారు అనే దానిపై పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అప్పగించిన గోవులన్నీ సమితిలో ఉన్నాయా, లేదా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
గో సంరక్షణ సమితి వెనుక మాఫియా! : ఎస్సై
గోసంరక్షణ సమితి నిర్వాహకుడిపై వచ్చిన ఫిర్యాదులపై శ్రీనివాసు, మరి కొంత మందిపై కేసు నమోదు చేసినట్టు దేవరపల్లి ఎస్సై పి.వాసు తెలిపారు. కేసు నుంచి బయటపడడానికి తాము కొట్టినట్టు శ్రీనివాస్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, కొట్టడం వాస్తవం కాదన్నారు. కంటెయినర్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చే టప్పటికే 30 గోవులు మృతి చెందినట్టు ఆయన తెలిపారు. గోసంరక్షణ సమితి వెనుక పెద్ద మాఫియా ఉందని వివరించారు. విచారణ తర్వాత వివరాలను చెబుతామని ఆయన పేర్కొన్నారు.
ఒడిశా నుంచి రవాణా
ఒడిశా, శ్రీకాకుళం నుంచి, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రతిఏటా వేలాది పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కే కాక, బంగ్లాదేశ్‌కూ పశువుల రవాణా యథేచ్ఛగా జరుగుతోందని సమాచారం. దీనికి పశ్చిమ గోదావరి జిల్లా అడ్డాగా మారింది. జిల్లాలో పదుల సంఖ్యలో దళారులు తయారై పశువుల రవాణా చేస్తున్న వాహనాలను సరిహద్దు దాటించడం పనిగా పెట్టుకున్నారు. వివిధ జిల్లాల నుంచి పశువులను ఆయా మార్కెట్లలో కొనుగోలు చేసి హైదరాబాద్ కబేళాకు తరలిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా కంటెయినర్లలో పశువులను సామర్థ్యానికి మించి లోడ్ చేసి పైన్ టార్పాలిన్ కప్పి అనుమానం రాకుండా రవాణా చేసేస్తున్నారు. ఈ విషయాలను రెండు నెలల క్రితమే సాక్షి వెలుగులోకి తీసుకువచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు తమదాకా వచ్చే సరికి హైరానా పడుతున్నారు.
Advertisement
Advertisement