సీపీఎస్ రద్దుకు కొవ్వొత్తుల ర్యాలీ
కాకినాడ సిటీ : రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు అన్ని శాఖల సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి మాట్లాడుతూ అతి దారుణమైన సామాజిక, ఆర్థిక భరోసా లేని లోపభూయిష్టమైన సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 109 మంది చనిపోయారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వారందరి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు అందజేయాలని, కుటుంబ పెన్షన్ వర్తింప చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రాట్యుటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు తూతిక విశ్వనా«థ్, జిల్లా కమిటీ ఆర్థిక కార్యదర్శి రత్నాకర్, ఉపాధ్యక్షుడు అలీమ్, సత్తిరాజు, భాస్కర్, కార్యదర్శి రమణమూర్తి, కాకినాడ నగర కమిటీఅధ్యక్షుడు జాన్ పాల్ పాల్గొన్నారు.