- పలువురు సెలబ్రెటీస్ హాజరు
- ఆదిలాబాద్ టైగర్స్ ఫ్రాంచైజీ వెంకటేశ్
19న టీపీఎల్ సన్నాహక క్రికెట్ మ్యాచ్
Published Tue, Aug 16 2016 6:47 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM
శ్రీరాంపూర్ : తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) పోటీలకు జిల్లా జట్టును సన్నద్ధం చేయడానికి ఈ నెల 19న సన్నాహక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ టైగర్స్ జట్టు ఫ్రాంచైజీ బి.వెంకటేశ్ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ క్రీడాకారులను వెలికితీయడానికి ఐపీఎల్ మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టీపీఎల్ ఏర్పడిందన్నారు. ఫిబ్రవరి నెలలో మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తయ్యిందన్నారు.
రెండో సీజన్ టోర్నీ అక్టోబర్‌లో ఉండబోతున్నట్లు తెలిపారు. మొదటి సీజన్‌లో జిల్లా జట్టు రెండు లీగ్ మ్యాచ్‌లో పాల్గొందని, ఇందులో ఫెయిర్ ఫ్లే అవార్డును గెలుచుకొందన్నారు. సీజన్ 2 కోసం సన్నద్ధం అవుతున్నట్లు తెలిపారు. దీని కోసం క్రీడాకారులకు ఆటపై అవగాహన పెంచడం, లీగ్‌లో మరింత రాణించడం కోసం సెలబ్రెటీస్‌తో ప్రత్యేక మ్యాచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న సైబర్ సిటీ చాంప్స్ వర్సెస్ ఆదిలాబాద్ టైగర్స్ మధ్య సన్నాహక మ్యాచ్ జరుగనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాబుఖాన్ మైదానంలో ఈ పోటీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి నగర కమిషనర్ సీపీ ఆనంద్, సినీ హీరోశ్రీకాంత్, టీవీ ఆరిస్టులు ప్రభాకర్, ఓంకార్‌తో పాటు జిల్లా ఎమ్మెల్సీ పురాణంసతీశ్, స్కేటింగ్ వరల్డ్ చాంపియన్, అర్జున అవార్డు గ్రహీత అనుప్‌కుమార్ యామిలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సన్నాహక మ్యాచ్‌ను లైవ్ ద్వారా కూడా చూసే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా జట్టు మేనేజర్ ముత్యం వెంకటస్వామి, అడ్వైజర్ రేగళ్ల ఉపేందర్‌లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement