సూపర్ సిక్స్ క్రికెట్ విజేత కైకలూరు 'ఏ' జట్టు
కైకలూరు : సూపర్ సిక్స్ ఫార్మాట్‌తో ఉత్సంఠభరితంగా జరిగిన క్రికెట్ పోటీల్లో కైకలూరు 'ఏ' జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండగ సందర్భంగా స్థానిక వైవీ ఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 11న ప్రారంభమైన పోటీలు సోమవారం ముగిశాయి. టోర్నమెంట్‌లో మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి. కేవలం ఆరు ఓవర్లు, ఆరుగురు ఆటగాళ్లతో సూపర్ సిక్స్ పోటీలు జరిగాయి. ఫైనల్ మ్యాచ్‌లో కైకలూరుకు చెందిన రాము సిక్సర్స్, కైకలూరు 'ఏ' జట్టు మధ్య పోటీ జరిగింది. టాస్ గెలిచిన రాము జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని ఆరు ఓవర్లలో 58 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కైకలూరు 'ఏ' జట్టు 3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగిన కానిస్టేబుల్ రజనీ 11 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ సతీష్ 9 బంతుల్లో 29 పరుగులు సాధించి జట్టుకు విజయం అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానిస్టేబుల్ రజనీకి దక్కింది. మొదటి బహుమతి రూ.15,000ను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), రెండో బహుమతి రూ.12.000ను జనసేనకు చెందిన బాబీ, వదర్లపాడు చందులు సమకూర్చారు. యూత్ నాయకుడు కేవీఎన్‌ఎం నాయుడు విజేతలకు బహుమతులు అందించారు. అంపైర్లుగా అజ్మల్, రాంబాబు వ్యవహరించారు. నిర్వాహకులు ప్రసాద్, నిమ్మలసాయి, కిరణ్ పాల్గొన్నారు.