వారం రోజుల్లో కోటి మొక్కలు నాటాలి
-
హరితహారంలో జిల్లా నెంబర్ వన్ కావాలి
-
విద్యార్థులు, వృత్తికులాల వారిదే ఈ బాధ్యత
-
అవసరమైనన్ని మెుక్కలు పంపిణీ చేస్తాం
-
10వేల మెుక్కలు నాటిన చోట బోర్లు వేయిస్తాం
-
హరితహారం చైతన్య సదస్సుల్లో మంత్రి ఈటల
కరీంనగర్ సిటీ : హరితహారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఆధ్వర్యంలో వృత్తి కులసంఘాలు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు, మహిళా సంఘాలతో జెడ్పీ సమావేశమందిరం, రెవెన్యూగార్డెన్స్‌లో వేర్వేరుగా హరితహారం చైతన్య సదస్సులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలో 2.28 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఖమ్మం మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా నాల్గవ స్థానంలో ఉందన్నారు. సమష్టిగా కష్టపడి జిల్లాను మొదటి స్థానంలో నిలిపాలన్నారు.
విద్యార్థులు భాగస్వాములు అయితేనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. జిల్లాలో 5.50 లక్షల మంది విద్యార్థులున్నారని, వీరిలో కనీసం 4లక్షల మంది 25 చొప్పున వారం రోజుల్లో కోటి మొక్కలు నాటాలని సూచించారు. పంచాయతీరాజ్ ఏఈలు, అటవీశాఖ అధికారులు పాఠశాలలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలోని రైల్వేట్రాక్‌లకు రెండు వైపులా 200 కిలోమీటర్ల మేర 10 లక్షల మొక్కలు, ఎస్సారెస్పీ కాలువల పక్కన 30 లక్షల మొక్కలతోపాటు రోడ్లు, వాగుల పక్కన విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం తరపున గుంతలు తవ్విస్తామని, మొక్కలు సరఫరా చేస్తామని, నాటాల్సిన, కాపాడాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదేన ని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంపై డీఈఓ సర్క్యులర్ జారీ చేయాలని ఆదేశించారు. గీతకార్మికులు చెరువులు, కుంటల కట్టలపై 10 లక్షల ఈత మొక్కలు నాటాలని, ముదిరాజ్‌లు గుట్టలు, ప్రభుత్వ స్థలాల్లో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, సీతాఫలం, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మెుక్కలు, యాదవులు వాగులు, చెరువుల పక్కన గొర్రెలకు అవసరమైన తుమ్మ, తదితర మొక్కలు నాటాలని కోరారు. ఆ మెుక్కలు చెట్లు ఎదిగిన తర్వాత వాటిపై పూర్తి హక్కు వృత్తి కులాలదేనని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపిస్తే ఐదు రోజుల్లో మొక్కలు అందిస్తామన్నారు. ఐదు నుంచి పదివేల మొక్కలు నాటిన చోట ప్రభుత్వ తరపున బోర్లు వేయిస్తామన్నారు. వేసవిలో అగ్నిమాపక వాహనాలు, ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోయిస్తామన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంపీ బి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ అడవులు అంతరించిపోయిన కారణంగానే జిల్లాలో సరిపడా వర్షాలు కురవడం లేదన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, ఫారెస్ట్ కన్జర్వేటర్ అక్బర్, డీఎఫ్‌ఓలు రవికిరణ్, వినోద్‌కుమార్, కె.మహేందర్‌రాజు, జెడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ దశరథం, పశుసంవర్ధక శాఖ జేడీ రామచంద్రం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ట్రస్మా నాయకులు యాదగిరి శేఖర్‌రావు, కడారి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.