చేతులు కాలాక ‘చెట్లు’ పట్టుకున్నామా?  | All world focus on Plantation | Sakshi
Sakshi News home page

చేతులు కాలాక ‘చెట్లు’ పట్టుకున్నామా? 

Published Sun, Jul 8 2018 4:27 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

All world focus on Plantation - Sakshi

తెలంగాణలో హరితహారం.. ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం!  కోస్టారికాలో ఒకటి.. పాకిస్తాన్, చైనాల్లో మరోటి.. ఇంకోటి! పేరు ఏదైనా జరుగుతున్నది మాత్రం ఒక మహా ఉద్యమం. కోటానుకోట్ల మొక్కల పెంపకం! భూమాతకి పచ్చాని కోక కట్టే యత్నం!

భూమాత కోపానికి బలికాకూడదని అనుకున్నారో... తిండితిప్పలకు కరవొచ్చి.. ఆయువు తీరుతుందన్న బెంగ వెంటాడిందో... కారణం ఏదైతేనేం.. చేతులు కాలాక అయినా సరే..  మనిషి మళ్లీ ప్రకృతి బాట పట్టేందుకు గట్టి ప్రయత్నం మొదలెట్టాడు!  సాహో అందాం.. మనమూ ఓ చేయి వేద్దాం! 

అభివృద్ధి పేరుతో ఇప్పటివరకూ జరిగింది ప్రకృతి వినాశనమే. చెట్లు కొట్టేశాం.. అడవుల్ని నరికేశాం. ఫలితం అనుభవిస్తున్నాం. ఎప్పుడు వస్తాయో తెలియని వానలు..మండువేసవిలో పలుకరించే వరదలు, గడగడలాడించాల్సిన చలికాలంలోనూ చెమట్లు! కలియుగంలో ప్రకృతి చిత్ర విచిత్రంగా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దపు అంతానికి భూమ్మీద మనిషి మనుగడే కష్టమైపోతుందన్న ఆందోళన వ్యక్తమైన సంగతి మనకు తెలిసిన విషయమే. దశాబ్దాల పరిశోధనలు, చర్చోపచర్చల తరువాత శాస్త్రవేత్తలు భూమి భవిష్యత్తును స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రపంచదేశాలు మేల్కొన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న ప్రధాన విష వాయువు కార్బన్‌ డైయాక్సైడ్‌ను కట్టడి చేసేందుకు కోటానుకోట్ల మొక్కలు నాటేందుకు నడుం బిగించాయి.! 

ఎవరెంత?  
ఏ పని చేసినా.. భారీగా చేసే చైనా మొక్కల విషయంలోనూ ఈ పంథాను వదల్లేదు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా కోటీ అరవై మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో.. మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంకోలా చెప్పాలంటే ఐర్లాండ్‌ దేశమంత సైజులో పచ్చదనం నింపే ప్రయత్నం అన్నమాట! మన దాయాది పాకిస్తాన్‌ వాయువ్య ప్రాంతంలోని కొండల్లో వంద కోట్ల మొక్కల్ని నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే.. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. లాటిన్‌ అమెరికా దేశాలు ఐదు కోట్ల ఎకరాల్లో అడవుల పెంపకానికి రెడీ అవుతున్నాయి. కూటికి పేదలని అందరూ అనుకునే ఆఫ్రికా దేశాలు.. తామూ పచ్చధనులమే అంటూ ఇంకో 25 కోట్ల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంగ్లాండ్, ఐర్లండ్, నార్వే, ఫ్రాన్స్, భారత్‌.. ఆ దేశం, ఈ దేశం అని లేదు.. 120కి పైగా దేశాల్లో ఈ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం సాగుతోంది. చెట్లు అంటే కేవలం కలప మాత్రమే కాదని అర్థం చేసుకున్నాం.

వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడతాయని, నీటి వనరుల్ని సంరక్షిస్తాయని, జీవ వైవిధ్యాన్ని పెంచుతాయని, భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయని ప్రపంచ దేశాలు గ్రహించుకున్నాయి. వాతావరణ సంక్షోభం నుంచి బయటపడాలంటే అడవుల్ని పెంచడమే పరిష్కారమార్గమని భావించి 2015లో భారీగా అటవీ విస్తీర్ణం పెంచుతామని ప్రతిజ్ఞ చేశాయి. 2030 నాటికి 350 మిలియన్‌ హెక్టార్లలో అడ వుల్ని (విస్తీర్ణంలోభారత్‌ కంటే కూడా ఎక్కువ) పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్ణయించింది. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమైనా అన్ని దేశాలు చెట్ల పెంపకంలో చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం 21.7శాతం అటవీ విస్తీర్ణం ఉంది. 2020 నాటికి 23 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఉంది. గత అయిదేళ్లుగా చైనాలో 51 కోట్ల ఎకరాల్లో అటవీవిస్తీర్ణం పెరిగింది. పాకిస్తాన్‌ కూడా 100 కోట్ల మొక్కలు నాటుతాం అంటూ తనకు తానే లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించడంలో కూడా అందరికంటే ముందుంది. అక్కడ ప్రతిఊరూ ఒక నందనవనంగా మారిపోతోంది. మొక్కలు నాట డమనేది నేడు  ప్రపంచ దేశా లకు ఒక చారిత్ర క అవసరంగా మారి పోయింది. అదొక రాజ కీయ, ఆర్థిక, పర్యావరణ అవసరం. 

ముప్పు తీరలేదు... 
బోలెడన్ని మొక్కలు నాటేశాం కదా.. ఇక చిక్కులు తీరినట్టేనా? అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన వినాశనంతో పోలిస్తే.. నాటిన మొక్కలు, పెరిగిన అటవీ విస్తీర్ణం పిసరంతే. చాలా దేశాల్లో పలు కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతూనే ఉంది. కలప స్మగ్లింగ్, కార్చిచ్చులు, చీడపీడలు ఇందుకు ప్రధాన కారణాలు. అమెజాన్‌ అడవులుండే బ్రెజిల్‌లో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడానికి స్మగ్లింగ్‌ కారణమవుతూంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లలో కార్చిచ్చులు అడవులను బలితీసుకుంటున్నాయి. గత 25 ఏళ్లలో అటవీ విస్తీర్ణం సగానికి పైగా తగ్గిపోయిందన్న వాస్తవం తెలిస్తే ఈ నష్టం పూడ్చటం అంత సులువు కాదని ఇట్టే అర్థమైపోతుంది.  

పరిష్కారం ఏమిటి? 
మొక్కలు పెంచే కార్యక్రమాలు.. పర్యావరణాన్ని కాపాడేలా, ప్రపంచం ఆకలి తీరేలా, కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేసేలా మారాలంటే.. ఏదో కొన్ని మొక్కలు నాటేస్తే సరిపోదన్నది నిపుణుల అభిప్రాయం. గంపగుత్తగా కొన్ని చోట్ల మొక్కలు నాటేసి అడవులను పెంచేశాం అని కాకుండా.. సాధారణ వ్యవసాయంలోనూ అడవులను పెంచాలని వీరు అంటున్నారు. ఆగ్రోఫారెస్ట్రీ అని పిలిచే ఈ పద్ధతిలో పంటపొలాల చుట్టూ కొంతమేరకు నీడనిచ్చే, ఫలా లందించే చెట్లు పెంచాలి. అలాగే మైదాన ప్రాంతాల్లో పచ్చికబీళ్లను ఏర్పాటు చేస్తే పాడిపశువుల మేత కరువు తీరడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటిభూమి 200 కోట్ల హెక్టార్లు ఉంది. వాటిల్లో వేర్వేరు రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యతను కాపాడుకోవాలని అప్పుడే వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

ఈ రకమైన ఆగ్రోఫారెస్ట్రీతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అనేందుకు నైజీరియానే నిదర్శనం. సుమారు 30 ఏళ్ల క్రితం నైజీరియాలో దుర్భర పేదరికం ఉండేది. కరువు కాటకాలతో ఆ దేశం అల్లాడిపోయింది. ధనిక దేశాల సూచనలు, సలహాల మేరకు చెట్లు, చేమల్ని తొలగించి చదును చేసి వేలాది హెక్టార్లలో గోధుమ, మొక్కజొన్న పంట లు వేశారు. కానీ అదో విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కొందరు యువ శాస్త్రవేత్తలు చెట్లు చేమలు తొలగించకుండానే పంటలు వేస్తే అద్భుతమైన దిగుబడులు వచ్చాయి. అప్పుడే వారికి తెలిసింది. చెట్లు ఉంటే పంటలు కూడా బాగా పండుతాయని. అప్పట్నుంచి నైజీరియా దాదాపుగా 20 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి ఏడాదికి ఆరు లక్షల టన్నుల వరకు పెరిగింది. మలావి, మాలి, ఇథియోపియా వంటి దేశాల్లో ఇప్పుడు రైతులే తమ వ్యవసాయ భూముల్లో చెట్లను కూడా పెంచుతున్నారు.

భారత్‌లోనూ పెరుగుతున్న పచ్చదనం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల్లో భారత్‌ టాప్‌–10లో ఉందంటేనే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలు రకరకాల పేర్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్నది లక్ష్యంగా భారత్‌ అడుగులు వేస్తోంది. 2015 నాటి పారిస్‌ ఒప్పందం ప్రకారం మొక్కల పెంపకానికే రూ.43 వేల కోట్లు వెచ్చించడానికి అంగీకరించింది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో నర్మద నదీ తీరం వెంబడి ఒక్కరోజే 6.6 కోట్ల మొక్కల్ని నాటడం ఇందులో భాగమే. రాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా రెండేళ్లలో అడవుల విస్తీర్ణం 6,778 చదరపు కిలోమీటర్ల మేర పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ (2,141 చ.కి) మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,101చ.కి), కేరళ (1,043 చ.కి.), ఒడిశా (885 చ.కి.), తెలంగాణ (565 చ.కి.)æ ఉన్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయాల్లో అభివృద్ధి పేరుతో చెట్లను నరికేయడం కొనసాగుతూనే ఉంది. భారత్‌ ఇదే స్థాయిలో మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తే ఏడాదికి 520 మిలియన్ల గ్రీన్‌హౌస్‌ వాయువుల్ని తగ్గించగలుగుతుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం.. తెలంగాణలో హరితహారం కొంతవరకు సత్ఫలితాల్నే ఇస్తున్నాయి. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినప్పటికీ మొక్కల్ని పెంచాలన్న అవగాహనను భవిష్యత్‌ తరాల్లో నింపుతున్నాయి. 2015లో మొదలైన హరితహారం కార్యక్రమంలో నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇప్పటివరకు 82 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. అయితే 20 కోట్ల విత్తనాలను కొండ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ చల్లారు. ఆ విధంగా చూస్తే 102 కోట్ల మొక్కల్ని నాటినట్టుగా లెక్క. రికార్డు స్థాయిలో 75 శాతం మొక్కల్ని పరిరక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏపీలోని అరకు ప్రాజెక్టులో భాగంగా స్థానిక గిరిజనులే లక్షల సంఖ్యలో పండ్ల మొక్కలు, కాఫీ చెట్లు పెంచారు. దీంతో పదిహేను వేల హెక్టార్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. 

కథనాలు సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement