భక్తజన హారతి
-
మహిళల సామూహిక పూజలు
మంథని/ కాళేశ్వరం: అంత్యపుష్కరాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంథని వద్ద గల గోదావరికి భక్తులు పోటెత్తారు. శ్రావణ సోమవారం కావడంతో భారీగా తరలివచ్చి పుష్కరస్నానం చేశారు. మహిళలు సామూహిక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతోపాటు వస్త్రాలను చాటలో పెట్టి సమర్పించారు. లింగదానం చేసుకున్న మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పిండప్రదానాలు, పితృతర్పణాలు జరిగాయి. నదీ తీరంలోని సంగమేశ్వరుడు, హనుమాన్, గౌతమేశ్వర స్వామితోపాటు అనుబంధ ఆలయాలు కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరంలో గోదావరి నదికి ఆలయ అధికారులు, అర్చకులు గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్ల ఆలయం నుంచి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో గోదావరి న దికి వెళ్లి అక్కడ గోదావరిమాతకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పంచహారతులను ఇచ్చారు. సర్పంచ్ మెంగాని మాధవి, ఎంపీపీ వెన్నపురెడ్డి వసంత, జెడ్పీటీసీ హసీన భాను, ఆలయ ఈవో డి.హరిప్రకాశ్‌రావు, మాజీధర్మకర్త అశోక్, అర్చకులు కృష్ణమూర్తిశర్మ, లక్ష్మీనారాయణశర్మ, ప్రశాంత్‌శర్మ, రామన్నశర్మ, రామాచార్యులు పాల్గొన్నారు.