త్వరలోనే సర్వజనాస్పత్రికి సీటీ స్కాన్
– సమాచారం ఇచ్చిన అడిషనల్ డీఎంఈ
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏడాదికి పైగా 'సీటీ స్కాన్' సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆస్పత్రికి త్వరలోనే సీటీ స్కాన్ పంపుతామని అడిషనల్ డీఎంఈ బాబ్జీ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తెస్తే రోగులకు ఊటర కలగనుంది. కాగా 'సీటీ స్కాన్' లేకపోవడంతో ఆస్పత్రిలో ఇబ్బందులపై గతంలో 'సాక్షి' కథనాలు రాసింది.
ఆరు నెలల క్రితం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సర్వజనాస్పత్రిలో నిద్ర చేసిన సమయంలో సీటీస్కాన్‌తో పాటు ఎంఆర్‌ఐని మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆయన హామీ గడువు ముగిసినా యంత్రం ఇక్కడికి రాకపోవడంపై గత నెల 13వ తేదీన 'మూడు మారిందా!' శీర్షికతో కథనం ప్రచురించింది. స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం, ఉన్నతాధికారులు విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి పరిస్థితులపై నివేదికను పంపడంతో పాటు యంత్రం పనికిరాదని బయోమెడికల్ ఇంజనీర్లు, యంత్రాన్ని సరఫరా చేసిన సంస్థ ప్రతినిధులు సర్టిఫై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో వీలైనంత త్వరలో సీటీ స్కాన్ అందుబాటులోకి తెస్తామని అడిషనల్ డీఎంఈ బాబ్జీ ఇక్కడికి సమాచారం ఇచ్చారు.