అలరించిన సాంస్కృతిక సంబరాలు
అనంతపురం కల్చరల్ : నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అద్భుత నృత్య ప్రదర్శనలతో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు మరోసారి ఆహూతులను మంత్ర ముగ్ధులను చేశారు. నాక్ బృందం సందర్శన సందర్భంగా సోమవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల డ్రామా హాలులో సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబిస్తూ సాగిన కళారూపాలతో విద్యార్థులు అలరించారు.
శివతాండవం రూపకంపై యశ్వంత్ శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం రెండు గంటల పాటు కరతాళ ధ్వనుల నడుమ హృద్యంగా సాగింది. విశిష్ట అతిథులుగా విచ్చేసిన నాక్ బృంద సభ్యులు ఆచార్య సతీందర్ సింగ్, ఆచార్య సోంకావాడే, ప్రొఫెసర్ ఎడ్విన్ జ్ఞానదాసు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రంగస్వామి, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త లక్ష్మీనారాయణ, డ్యాన్స్ మాస్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.