సాంస్కృతిక క్రీడా సంబరం
- ఘనంగా సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం
- సాహస విన్యాసాలు, సాంస్కృతిక క్రీడలతో అలరించిన విద్యార్థులు
పుట్టపర్తి టౌన్ : సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభంబించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఒళ్లు గగూర్పొడిచే సాహసోపేత విన్యాసాలతో సత్యసాయి విద్యార్థులు ఆహుతులను అబ్బుర పరిచారు. సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. పుట్టపర్తి సత్యసాయి హిల్‌వీవ్ స్టేడియం వేదికగా జరిగిన సమ్మేళనాన్ని వేలాది మంది హాజఽరయ్యారు. ముందుగా సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి హిల్‌వీవ్ స్టేడియం శాంతివేదికపై ఏర్పాటు చేసిన సత్యసాయి ఆసనంపై ఉంచారు. అనంతరం మార్చ్ ఫాస్ట్ చేశారు. తర్వాత సత్యసాయి యునివర్శిటీ పతాకాన్ని వైస్ చాన్సలర్ కేబీఆర్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు.
మొదట అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు పురాణ వేదమంత్రాలను వళ్లిస్తూ యోగాసనాల ఆవశ్యకతను వివరించే 36 యోగా విన్యాసాలను ప్రదర్శించారు. తర్వాత జంపింగ్, లాంగ్‌జంప్, బైక్ రైడింగ్ విన్యాసాలు చేశారు. సిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ సైన్సెస్ వైట్‌ఫీల్డ్ విద్యార్థినిలు జానపద కళను, యోగా, ఏరోబిక్స్ విన్యాసాలను బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అత్యద్భుతంగా ప్రదర్శించారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన స్కైరన్నర్స్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన సమ్మేళన కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్‌జె.రత్నాకర్‌రాజు, చక్రవర్తి, నాగానంద, భగవత్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.