
కాసులకు కటకట
- ఎక్కడ చూసినా ‘నోక్యాష్’
– 450 బ్యాంకు శాఖలకు రూ.20 కోట్ల కేటాయింపుతో అవస్థలు
– ఏటీఎంల పరిస్థితి ఘోరం
– జిల్లా వ్యాప్తంగా చాలా బ్యాంకు శాఖల్లో నిలిచిపోయిన విత్‌డ్రాలు
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రోజులు గడుస్తున్నా కరెన్సీ సమస్య మాత్రం తీరడం లేదు. 28వ రోజు మంగళవారం కూడా అన్ని వర్గాల పరిస్థితి దయనీయంగా కన్పించింది. చాలా బ్యాంకుల వద్ద 'నోక్యాష్' 'క్యాష్‌నిల్' బోర్డులు దర్శనమిచ్చాయి. జిల్లా కేంద్రంలోనే ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్, ఏపీజీబీ లాంటి ప్రధాన బ్యాంకులకు చెందిన కొన్ని శాఖల్లో 'నో క్యాష్' బోర్డులు కనిపించడం గమనార్హం. ఇక మండల, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన బ్యాంకులు పరిమితంగానే కన్పించాయి. నగదు లేక కొన్ని బ్యాంకులు మధ్యాహ్నం వరకు పనిచేయగా... ఆలస్యంగా సరఫరా కావడంతో మరికొన్ని బ్యాంకులు మధ్యాహ్నం తర్వాత సేవలు కొనసాగించాయి.
జిల్లా వ్యాప్తంగా 34 ప్రిన్సిపల్ బ్యాంకులు, వాటి పరిధిలో ఉన్న 450 శాఖలకు కేవలం రూ.20 కోట్లు (అన్నీ రూ.2 వేల నోట్లు) కేటాయించడంతో సర్దుబాట్లు కూడా సాధ్యం కావడం లేదని బ్యాంకర్లు తెలిపారు. ఎక్కువ అకౌంట్లు కలిగిన ఎస్‌బీఐ, ఏపీజీబీ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ , కెనరా లాంటి ప్రధాన బ్యాంకుల్లో క్యూలైన్లు కనిపించాయి. విత్‌డ్రాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరినా చాలా మందికి నగదు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మరీ అత్యవసరమైన వారు, సిఫారసులున్న వారికే రూ.10 వేలు లేదా గరిష్టంగా రూ.14 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలో రోజుకు కనీసం రూ.90 కోట్లు కేటాయిస్తే అందరికీ కొంత వరకు నగదు ఇవ్వడానికి సాధ్యమవుతుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే జిల్లాలో ఏ రోజు కూడా ఈ స్థాయిలో నగదు సరఫరా కావడం లేదు. బ్యాంకు కౌంటర్లలో విత్‌డ్రాలకే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటంతో ఏటీఎంలను జనం పూర్తిగా మరచిపోయారు. 556 ఏటీఎంలకు గానూ మంగళవారం 13 మాత్రమే పనిచేశాయి.
రోడ్డెక్కుతున్న ప్రజలు
తలుపుల/అమరాపురం : కరెన్సీ కష్టాలు అధికం కావడంతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. మంగళవారం తలుపుల మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎదుట ఖాతాదారులు, మహిళలు ధర్నా చేశారు. వీరికి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శంకర,యూత్ కన్వీనర్ ఉత్తారెడ్డి,రైతు సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రమణ మద్దతు పలికారు. అలాగే అమరాపురం సిండికేట్ బ్యాంకు ఎదుట పెన్షనర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ పెన్షన్ ఖాతాలో డబ్బు జమ అయ్యిందని, అయితే బ్యాంకు వద్దకు వస్తే నోక్యాష్ బోర్డు దర్శనమిస్తోందని వారు వాపోయారు. కంబదూరు స్టేట్‌బ్యాంక్ ఎదుట కూడా పింఛన్‌దారులు ధర్నా చేపట్టారు.