పెద్ద నోట్ల మార్పిడి పేరిట మోసం
►ఐదుగురు నిందితుల అరెస్టు
►రూ.23.50 లక్షలు కాజేసిన వైనం
►రూ.9 లక్షల నగదు స్వాధీనం
చిత్తూరు (అర్బన్): పెద్ద నోట్ల రద్దు సమయంలో పాత నోట్లు తీసుకుంటామని పలువురిని మోసం చేసి నగదు పారిపోయిన అంతర్రాష్ట్ర ముఠాను చిత్తూరు పశ్చిమ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల్లో పుత్తూరుకు చెందిన కోదండరాజు (40), కర్ణాటకలోని కేజీఎఫ్‌కు చెందిన అశ్వర్థనారాయణ (45), బంగారుపేటకు చెందిన ప్రభాకర్ (48), వినోద్ (30), చిన్నరాజ (45) ఉన్నారు. మంగళవారం డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ ఎం.ఆదినారాయణ ఈ వివరాలను వెల్లడించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శేఖర్ నాయుడు, కాణిపాకానికి చెందిన రఫి స్నేహితులు. వీళ్లకు ఈ ఏడాది జనవరిలో ఓ ఫోన్‌కాల్ వచ్చింది. రద్దు చేసిన రూ.500, రూ.1000 వెయ్యి నోట్లు తమ వద్ద రూ.17 లక్షల వరకు ఉన్నాయని, వీటిని తీసుకుని కొత్త నోట్ల రూపంలో రూ.9 లక్షలు ఇవ్వాలని బేరం కుదుర్చుకున్నారు.
నమ్మకం కలిగించేందుకు హైదరాబాద్‌కు చెందిన మధ్యవర్తి రాణి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు సాయిచరణ్‌ను చిత్తూరుకు పంపించారు. శేఖర్‌నాయుడు, రఫి రూ.9 లక్షలు సిద్ధం చేసుకుని జనవరి 4న కాణిపాకం ఆలయ శివారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న రాణి, ఆమె కుమారుడు పాత నోట్ల తీసుకురావాలని ఫోన్ చేయడం.. హఠాత్తుగా ఐదుగురు వ్యక్తులు ఓ కారులోంచి దిగి, తాము పోలీసులమని చెప్పి శేఖర్, రఫి వద్ద ఉన్న రూ.9 లక్షలు లాక్కున్నారు. స్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి నగదు తీసుకెళ్లాలని చెప్పి వెళ్లిపోయారు. బాధితులు తేరుకుని వచ్చింది నకిలీ పోలీసులని గుర్తించి కాణిపాకం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చిత్తూరు పశ్చిమ సీఐ ఆదినారాయణ.. ఘటనలో సంబంధమున్న రాణి, సాయిచరణ్‌లను అప్పట్లో అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. తాజాగా కాణిపాకం రోడ్డులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పది మందిలో ఏడుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
పలు చోట్ల మోసాలు : నిందితులు ఇదే తరహాలో కుప్పంలో ఓ వ్యక్తి నుంచి రూ.2.5 లక్షలు, తిరుపతి ఎంఆర్.పల్లెలో రూ.5 లక్షలు, చిత్తూరులోని బాన్స్ సమీపంలో రూ.7 లక్షలు మోసం చేసి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ మూడు ఘటనలపై ఎక్కడా బాధితులు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం! కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన కాణిపాకం ఎస్‌ఐ నరేష్‌బాబు, సిబ్బంది శివ, వినోద్, రమేష్, సీపీవోలు సోమేష్, దుర్గ తదితరులకు డీఎస్పీ, సీఐలు నగదు రివార్డులను అందచేశారు.